ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గ్రామకంఠాల మినహాయింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014-19 మధ్య రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో భూసమీకరణ నుంచి ఇచ్చిన గ్రామకంఠాల మినహాయింపులను మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రి నారాయణను ఆదేశించారు.

ఆ సమయంలో గ్రామకంఠాలు, విస్తరించిన గ్రామకంఠాల పరిధిని శాటిలైట్ చిత్రాలు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా గుర్తించి భూసమీకరణ నుంచి మినహాయింపులు ఇచ్చారు. గ్రామాలకు ఆనుకుని ఉన్న బారెన్లు, పశువుల కొట్టాలను కూడా కొన్ని సందర్భాల్లో మినహాయించారు. ఇందుకు సంబంధించి సీఆర్‌డీఏ నిబంధనలు రూపొందించింది.

ఇటీవల మరికొందరు రైతులు తమ భూములను కూడా గ్రామకంఠాలుగా పరిగణించి భూసమీకరణ నుంచి మినహాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం 698 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా.. కేవలం 17 మంది మాత్రమే మినహాయింపునకు అర్హులని కమిటీ తేల్చింది.

దీంతో మిగిలిన రైతుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. గతంలో కొందరికి నిబంధనలకు విరుద్ధంగా మినహాయింపులు ఇచ్చారంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ విషయాన్ని మంత్రి నారాయణ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో.. 2014-19 మధ్య ఇచ్చిన గ్రామకంఠాల మినహాయింపులన్నింటినీ పునఃపరిశీలించాలని చంద్రబాబు ఆదేశించారు.

By Ramya