అక్టోబర్‌లో పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్న వేళ.. ఓ చిన్న సినిమా మాత్రం ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘బా బా బ్లాక్ షీప్’ అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా దర్శకుడు నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఆసక్తి పెరిగింది.

ప్రేక్షకులకు మేఘాలయ ట్రిప్

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమాను థియేటర్లలో వీక్షించే ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఓ కాంటెస్ట్ నిర్వహించి, విజేతలను ఉచితంగా మేఘాలయ ట్రిప్‌కు తీసుకెళ్లనున్నట్లు ఆయన ప్రకటించారు. స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రానికి గుణి మంచికంటి దర్శకత్వం వహించారు. సినిమాకు సంబంధించిన విజువల్స్ విషయంలో మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దాదాపు 28 రోజుల పాటు మేఘాలయలోని అందమైన, అంతగా పరిచయం లేని ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు.

మేఘాలయ అందాలను తెరపైకి..

ఒక తెలుగు సినిమాను పూర్తిస్థాయిలో మేఘాలయలో చిత్రీకరించడం ఇదే తొలిసారి అని చిత్ర బృందం చెబుతోంది. విదేశీ లొకేషన్లకు వెళ్లకుండా దేశంలోనే ఉన్న ప్రకృతి అందాలను ప్రేక్షకులకు పరిచయం చేయడంతో పాటు, మేఘాలయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అక్కడ షూటింగ్ నిర్వహించినట్లు నిర్మాత వేణు దోనేపూడి వెల్లడించారు.

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా, అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అందించిన సహకారంతోనే ఈ చిత్రీకరణ సాధ్యమైందని ఆయన తెలిపారు.

ప్రతి పాత్రకూ ప్రాధాన్యం

‘బా బా బ్లాక్ షీప్’లో హీరో, హీరోయిన్, విలన్ అంటూ సాధారణ ఫార్ములాకు పరిమితం కాకుండా కథలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండేలా స్క్రీన్‌ప్లేను రూపొందించినట్లు తెలుస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు ఉపేంద్ర లిమాయె ఈ సినిమాలో కీలకమైన పూర్తి స్థాయి పాత్రలో కనిపించనున్నారు.

ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు కృతజ్ఞతలు తెలిపారు. తాను పాత్ర కంటే కథ, కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని.. దర్శకుడు గుణి మంచికంటి చెప్పిన కథాంశం నచ్చడంతోనే ఈ సినిమాకు అంగీకరించినట్లు వెల్లడించారు.

అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్, నేపాల్ నటి సమృద్ధి ఆర్యాళ్, మాల్వీ మల్హోత్రా, టిను ఆనంద్, జార్జ్ మరియన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మరి అక్టోబర్ బరిలో పెద్ద సినిమాల మధ్య ‘బా బా బ్లాక్ షీప్’ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.