ధారాపురం ఉపఎన్నికల ప్రచారంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. టీవీకే అభ్యర్థి సత్యభామను ఉద్దేశిస్తూ స్టాలిన్ ‘సూట్‌కేస్ భామ’, ‘పల్టీ భామ’ వంటి పదాలను ఉపయోగించడంతో పాటు, ఆమె శరీరాకృతిపై కూడా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

స్టాలిన్ వ్యాఖ్యలపై టీవీకే నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా, సత్యభామ గతంలో ఏఐఏడీఎంకే తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో ధారాపురం ఉపఎన్నిక అనివార్యమైంది.

తమిళనాడు రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. ధారాపురం ఉపఎన్నికలో టీవీకే అభ్యర్థిగా బరిలో ఉన్న సత్యభామపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

డీఎంకే అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించిన స్టాలిన్‌.. ఇటీవల ఏఐఏడీఎంకే నుంచి టీవీకేలో చేరిన సత్యభామ పార్టీ మారడాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాలు, డబ్బు వ్యవహారాల కారణంగానే ఆమె పార్టీ మారారంటూ ఆరోపిస్తూ ‘సూట్‌కేస్ భామ’, ‘పల్టీ భామ’ వంటి పదాలను ఉపయోగించారు. ఆమె శరీరాకృతిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి.

స్టాలిన్‌ వ్యాఖ్యలపై టీవీకే నేత, తమిళనాడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కె.జి. అరుణ్‌రాజ్‌ తీవ్రంగా స్పందించారు. సత్యభామపై స్టాలిన్‌ అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగించారని, ఆమె వ్యక్తిగత రూపురేఖలను ప్రస్తావించడం తగదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో ధారాపురం ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా ఇరు పార్టీల మధ్య రాజకీయ విమర్శలు మరింత తీవ్రతరం అయ్యాయి. స్టాలిన్‌ వ్యాఖ్యలు, వాటిపై టీవీకే నేతల స్పందన ప్రస్తుతం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మహిళలను అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు స్టాలిన్‌ క్షమాపణ చెప్పాలని టీవీకేకు చెందిన పలువురు మంత్రులు, నేతలు డిమాండ్‌ చేశారు. టీవీకే మంత్రి ఎస్. కీర్తన కూడా స్టాలిన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై అక్టోబర్‌ 6న ధారాపురం మహిళలు తమ ఓటు హక్కు ద్వారా తగిన సమాధానం ఇస్తారని ఆమె అన్నారు.

సత్యభామ ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అభ్యర్థిగా ధారాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరారు. దీంతో ధారాపురం అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి ఆమె టీవీకే అభ్యర్థిగా మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు.

సత్యభామ పార్టీ మారడంపై డీఎంకే, ఏఐఏడీఎంకేలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి మరో పార్టీలో చేరడం చట్టపరంగా వారికి ఉన్న హక్కు అని టీవీకే వాదిస్తోంది. ఈ అంశంతో పాటు స్టాలిన్‌ వ్యాఖ్యలపై వివాదం నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.