బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ (Drishyam 3) బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్‌ను నమోదు చేసింది. ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో చివరి భాగంగా వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే భారీ వసూళ్లు సాధించి అజయ్ దేవగణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.

తొలిరోజే రూ.95 కోట్లకు పైగా గ్రాస్

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘దృశ్యం 3’ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.95.10 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. భారత్‌లో రూ.66.75 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించగా.. గ్రాస్ పరంగా రూ.80.10 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో రూ.15 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇంతకుముందు అజయ్ దేవగణ్ కెరీర్‌లో అత్యధిక ఫస్ట్ డే వసూళ్లుగా ‘సింగం ఎగైన్’ నిలిచింది. ఆ చిత్రం తొలి రోజు సుమారు రూ.43.5 కోట్ల నెట్ సాధించింది. ఇప్పుడు ‘దృశ్యం 3’ ఆ రికార్డును భారీ తేడాతో అధిగమించింది.

అజయ్ దేవగణ్ అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల జాబితాలో ‘సింగం రిటర్న్స్’ రూ.32.1 కోట్లతో, ‘గోల్‌మాల్ ఎగైన్’ రూ.30.15 కోట్లతో, ‘రైడ్ 2’ రూ.19.25 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

‘దృశ్యం’ సిరీస్‌లో భారీ జంప్

2015లో విడుదలైన తొలి ‘దృశ్యం’ చిత్రం మొదటి రోజు కేవలం రూ.5.85 కోట్ల వసూళ్లతో ప్రారంభమైంది. అయితే పూర్తి రన్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.110 కోట్లు రాబట్టింది.

2022లో వచ్చిన ‘దృశ్యం 2’ మొదటి రోజే రూ.15.38 కోట్ల వసూళ్లు సాధించి.. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా రూ.342 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు ‘దృశ్యం 3’ మాత్రం తొలి రోజే భారీ వసూళ్లతో ఈ ఫ్రాంచైజీని మరో స్థాయికి తీసుకెళ్లింది.

బాలీవుడ్ టాప్ ఓపెనర్లలో చోటు

బాలీవుడ్‌లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘దృశ్యం 3’ మూడో స్థానంలో నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘ధురంధర్: ది రివెంజ్’ రూ.75 కోట్ల నెట్‌తో మొదటి స్థానంలో ఉండగా.. ‘జవాన్’ రూ.65.50 కోట్ల నెట్‌తో రెండో స్థానంలో ఉంది.

ఈ ఏడాది ‘ధురంధర్: ది రివెంజ్’, ‘హనుమాన్ అంశ్’ తర్వాత తొలి రోజే భారీ స్పందన అందుకున్న చిత్రాల్లో ‘దృశ్యం 3’ కూడా చేరింది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను నమోదు చేస్తుందో చూడాలి.