తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) వర్గాల మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఎమ్మెల్యే ఓ ఉపాధ్యాయుడిని కొట్టారంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఆయన కొట్టిపారేశారు.

ఈ ఆరోపణల వెనుక ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి చెందిన నేతలు ఉన్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే వారిపై తీవ్రంగా స్పందిస్తానని హెచ్చరించారు.

తనపై టీచర్‌పై దాడికి సంబంధించిన ఆరోపణలు నిజమైతే అందుకు సంబంధించిన ఆధారాలను బహిరంగంగా బయటపెట్టాలని కొలికపూడి సవాల్ చేశారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని పేర్కొన్నారు.

తాను ఉపాధ్యాయుడిని తిట్టినట్లు లేదా కొట్టినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొలికపూడి స్పష్టం చేశారు. అదే సమయంలో ఆరోపణలు నిరూపించలేకపోతే అవి తప్పుడు ఆరోపణలని అంగీకరించి బహిరంగ క్షమాపణలు చెప్పాలని బాలకోటయ్యను డిమాండ్ చేశారు.

పోతుల బాలకోటయ్య గత రెండేళ్లుగా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన అంతర్గత వ్యవహారాలపై తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఆయన ఎంపీ కేశినేని చిన్ని సూచనల మేరకు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

మరోవైపు, తిరువూరు నుంచి టీడీపీ కార్యకర్తలు విజయవాడలోని బాలకోటయ్య కార్యాలయానికి వెళ్లనున్నారని కొలికపూడి తెలిపారు. తనపై ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపించాలని, లేనిపక్షంలో తప్పుడు ప్రచారం చేయవద్దని ఆయన సూచించారు.

సోషల్ మీడియాలో తనపై నిరాధార ఆరోపణలు చేసే విషయంలో ఇకపై వెనక్కి తగ్గేది లేదని కొలికపూడి హెచ్చరించారు. ఈ వ్యవహారం టీడీపీలోని తిరువూరు నియోజకవర్గ అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది.

By Ramya