మూడు కార్పొరేషన్లలో ఏకరూప పాలనకు ఉద్దేశించిన క్యూఆర్‌ఈ-2026 చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్‌ కార్పొరేషన్ల పరిధిలో భూవిలువ ఆధారిత ఆస్తిపన్ను విధానం అమల్లోకి రానుంది.

కొత్త విధానం ప్రకారం 375 చదరపు అడుగుల్లోపు విస్తీర్ణం ఉన్న ఇళ్లకు ఏడాదికి రూ.101 ఆస్తిపన్నుగా నిర్ణయించారు. కొత్తగా నిర్మించే భవనాలకు ఈ విధానం ఏప్రిల్‌ 1 నుంచి వర్తించనుండగా, ఇప్పటికే ఉన్న పాత భవనాలకు 2027 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పన్ను విధానం అమలు చేయనున్నారు.

అలాగే అనధికార నిర్మాణాలపై 25 శాతం నుంచి 300 శాతం వరకు జరిమానాలు విధించేలా నిబంధనలు రూపొందించారు.

మూడు కార్పొరేషన్లలో ఏకరూప పాలనకు ఉద్దేశించిన క్యూఆర్‌-2026 చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్‌ నగరపాలక సంస్థల పరిధిలో ఆస్తిపన్ను విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

కొత్త విధానంలో భూవిలువ ఆధారంగా ఆస్తిపన్నును మదింపు చేయనున్నారు. మూడు కార్పొరేషన్లలోనూ పన్ను మదింపు విధానం ఒకేలా ఉండేలా నూతన నిబంధనలను రూపొందించినట్లు సీఎంసీ కమిషనర్‌ జి.సృజన తెలిపారు. శనివారం ఆమె భూవిలువ ఆధారిత ఆస్తిపన్ను విధానానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

పన్ను విధానంలో మార్పుల వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను కల్పించినట్లు ఆమె పేర్కొన్నారు.

375 చదరపు అడుగులలోపు నిర్మాణ విస్తీర్ణం ఉన్న ఇళ్ల యజమానులకు ఏడాదికి కేవలం రూ.101 ఆస్తిపన్ను మాత్రమే వసూలు చేయనున్నట్లు కమిషనర్‌ స్పష్టం చేశారు. చిన్న ఇళ్ల యజమానులపై కొత్త పన్ను విధానం వల్ల అదనపు భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో అమల్లో ఉన్న ఎర్లీబర్డ్‌ రాయితీని కూడా కొనసాగించనున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం కొత్తగా పన్ను మదింపు చేయించుకునే ఆస్తులకు మాత్రమే భూవిలువ ఆధారిత ఆస్తిపన్ను విధానం అమలు కానుంది. రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించిన భూవిలువను ప్రాతిపదికగా తీసుకుని పన్నును మదింపు చేస్తారు. నివాస భవనాలకు భూవిలువలో 0.15 శాతం, నివాసేతర భవనాలకు 0.75 శాతం, ఖాళీ స్థలాలకు 0.5 శాతం చొప్పున ఆస్తిపన్ను విధించనున్నారు.

ఇప్పటికే ఉన్న పాత భవనాలకు ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం వార్షిక విలువ ఆధారంగా పన్ను చెల్లిస్తున్న పాత భవనాలను భూవిలువ ఆధారిత విధానంలోకి మార్చే ప్రక్రియను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించనున్నారు. దీంతో 2027 ఏప్రిల్‌ 1 నుంచి మూడు కార్పొరేషన్ల పరిధిలోని పాత భవనాలకు కూడా కొత్త విధానం ప్రకారం ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త విధానం అమలుతో పాత జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొన్ని భవనాల ఆస్తిపన్ను స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు అనధికారిక నిర్మాణాలపై కఠిన చర్యలకు కూడా నిబంధనలు రూపొందించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై విధించే ఆస్తిపన్నుకు అదనంగా కనిష్ఠంగా 25 శాతం నుంచి గరిష్ఠంగా 300 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.