
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘బ్లడీ రోమియో’పై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. డార్క్ హ్యూమర్, యాక్షన్ అంశాలను మేళవిస్తూ సరికొత్త గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా నాని ఇందులో ఇంతకుముందెన్నడూ కనిపించని లుక్‌లో కనిపించనున్నారనే వార్తలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
హీరోయిన్ విషయంలో కొత్త పేరు
ఈ చిత్రంలో హీరోయిన్‌గా ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ మీనాక్షి చౌదరి పేరు గతంలో ప్రముఖంగా వినిపించింది. మేకర్స్ కూడా ఆమెను కథానాయికగా పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇప్పుడు మరో తమిళ భామ ప్రీతి ముకుందన్ పేరు తెరపైకి వచ్చింది.
సుజీత్ రూపొందించిన పాత్రకు మీనాక్షి కంటే ప్రీతి ముకుందన్ అయితే మరింతగా సరిపోతుందని భావించిన చిత్రబృందం ఆమె వైపు మొగ్గు చూపినట్లు టాక్. ప్రస్తుతం ఆమె పేరును దాదాపు ఖరారు చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
యూకే బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామా
‘బ్లడీ రోమియో’ కథ యూకే బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని సమాచారం. ఫుడ్, గ్యాంగ్‌స్టర్ అంశాలను మిళితం చేస్తూ దర్శకుడు సుజీత్ ఈ సినిమాను స్టైలిష్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
‘ది ప్యారడైజ్’ తర్వాత నాని నుంచి రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నాని సొంత నిర్మాణ సంస్థ యూనానిమస్‌తో కలిసి నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరి ‘బ్లడీ రోమియో’తో నాని ఎలాంటి బాక్సాఫీస్ ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
