
ప్రస్తుతం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన డీప్‌ఫేక్ ఘటనలపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం ఒక సంఘటనగా చూడకూడదని.. భవిష్యత్తులో ఎదురయ్యే మరిన్ని ప్రమాదాలకు హెచ్చరికగా భావించాలని అన్నారు. ఇదే సమయంలో సినిమాల విడుదలకు ముందే ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ ప్రచారం చేసే విధానంపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రామ్ పోతినేని వ్యాఖ్యలపై విష్ణు
డీప్‌ఫేక్ వీడియోలపై హీరో రామ్ పోతినేని చేసిన వ్యాఖ్యలను మంచు విష్ణు ప్రస్తావించారు. సోషల్ మీడియా ఖాతాలను ఆధార్ వంటి గుర్తింపు విధానాలతో అనుసంధానం చేయాలన్న రామ్ సూచనపై పరిశ్రమలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను తాను గౌరవిస్తానని, అయితే దానిని అడ్డుపెట్టుకుని అజ్ఞాతంగా ఇతరులను వేధించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. కేవలం ఒక వీడియోను తొలగించడం లేదా ఫిర్యాదు చేయడంతో డీప్‌ఫేక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని అభిప్రాయపడ్డారు.
పరిశ్రమ అంతా కలిసి ఎదుర్కోవాలి
తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌తో పాటు పరిశ్రమలోని అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని విష్ణు సూచించారు. ఏఐ డీప్‌ఫేక్‌లు, సినిమాలను ఉద్దేశపూర్వకంగా ఆన్లైన్లో దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సినిమాలు, నటులు, దర్శకులను లక్ష్యంగా చేసుకుని కొంతకాలంగా పరిశ్రమలోనే కొందరు నెగెటివిటీని వ్యాప్తి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనేది ప్రేక్షకుల నిర్ణయంపై ఆధారపడాలని, విమర్శలు, రివ్యూలు, ట్రోలింగ్ వంటివి సహజమేనని అన్నారు. అయితే ప్రేక్షకులు సినిమా చూసేలోపే దాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నాలు మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
‘ది ప్యారడైజ్’ను ప్రస్తావించిన విష్ణు
‘ది ప్యారడైజ్’ చిత్రబృందం కూడా విడుదలకు ముందే ఇలాంటి ప్రచారాల నుంచి రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని మంచు విష్ణు గుర్తుచేశారు. ఒక సినిమా విజయం లేదా పరాజయం మొత్తం టాలీవుడ్ పరిశ్రమకు ప్రతిరూపం కాదని అన్నారు. పరిశ్రమ అందరిదని, కొత్తవారు ఎంతమంది వచ్చినా ప్రతి ఒక్కరికీ తమదైన స్థానం ఉంటుందని పేర్కొన్నారు.
‘మా’ అధ్యక్షుడిగా ఈ అంశాన్ని తాను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నానని విష్ణు తెలిపారు. నటుల ఫొటోలను దుర్వినియోగం చేస్తూ అసభ్యకరమైన కంటెంట్‌ను రూపొందించే వ్యక్తులు, ప్రజలను తప్పుదోవ పట్టించే సోషల్ మీడియా ఖాతాల వివరాలను ‘మా’ సేకరిస్తోందని వెల్లడించారు.
“ప్రతి శుక్రవారం మనం పోటీ పడొచ్చు. కానీ మిగిలిన వారమంతా ఒకరినొకరు నాశనం చేసుకునేందుకు ప్రయత్నించకూడదు. సినిమాను గెలవనివ్వండి” అంటూ మంచు విష్ణు తన పోస్టులో పేర్కొన్నారు.
