
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడంటే..?
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. వాస్తవానికి అక్టోబర్‌లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తొలుత భావించారు. అయితే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పరిస్థితులు మారిపోయాయి.
ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, మార్చిలోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఉంది. నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ.3,700 కోట్ల నిధులు నిలిచిపోయే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఆర్థిక సంఘం నిధుల లింక్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికలకు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులకు మధ్య కీలకమైన లింక్ ఉంది. ఏపీకి 16వ ఆర్థిక సంఘం ద్వారా సుమారు రూ.3,700 కోట్ల నిధులు రావాల్సి ఉంది. ఈ నిధులు విడుదల కావాలంటే వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
నిర్దేశిత గడువులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తయితేనే ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఒకవైపు బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తుండగా.. మరోవైపు మార్చి నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేసి కేంద్ర నిధులను పొందాల్సిన పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి ఏర్పడింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు వేగం.. రూ.3,700 కోట్ల నిధులపై రాష్ట్రం దృష్టి
కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.28,787 కోట్ల నిధులు రావాల్సి ఉంది. ఇందులో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.2,138 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.1,562 కోట్లు కలిపి మొత్తం రూ.3,700 కోట్లను రెండు విడతల్లో విడుదల చేయనున్నారు. అయితే ఈ నిధులు పొందాలంటే వచ్చే మార్చి నాటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో అంతకంటే ముందుగానే ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది.
కేంద్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల కావాలంటే స్థానిక సంస్థలకు ఎన్నికైన పాలకవర్గాలు తప్పనిసరిగా ఉండాలి. ఆయా సంస్థల్లో పాలకవర్గాలు ఉన్నాయా? లేదా? అనే అంశాన్ని పరిశీలించిన అనంతరమే కేంద్రం నిధులను విడుదల చేయనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల పదవీకాలం ఇప్పటికే ముగిసింది. గత ప్రభుత్వ హయాంలో కోర్టు కేసులు, ఇతర కారణాలతో కొన్ని ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా నిలిచిపోయింది.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతోంది. రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
గత ప్రభుత్వ హయాంలో 15వ ఆర్థిక సంఘం కింద రావాల్సిన రూ.615 కోట్ల నిధులను రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చింది. ఈ నిధులను విడుదల చేయాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని కోరినప్పటికీ ఇప్పటివరకు సానుకూల ఫలితం దక్కలేదు.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి, ఎన్నికైన పాలకవర్గాలను ఏర్పాటు చేయడం ద్వారా కేంద్ర ఆర్థిక సంఘం నిధులను పొందడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తోంది.
