
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాలకు సంబంధించిన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు.
కేసీఆర్ కుటుంబంపై సుమారు రూ.లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డిపై సుమారు రూ.50 వేల కోట్ల మేర సంపద కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయని లేఖలో రఘునందన్ రావు ప్రస్తావించారు. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ఆయన కోరారు.
ఎన్నికల అఫిడవిట్లలో ఇరువురు నేతలు, వారి కుటుంబ సభ్యులు ప్రకటించిన ఆస్తులతో పాటు అదనంగా ఏమైనా ఆస్తులు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను రఘునందన్ రావు కోరారు.
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు కూడా ఫిర్యాదు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు.
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య కొనసాగుతున్న ఆస్తుల ఆరోపణల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు భారీగా ఆస్తులు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తుండగా.. బీఆర్ఎస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, సోదరులకు భారీగా ఆస్తులు ఉన్నాయంటూ గులాబీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశంపై బీజేపీ నేతలు సైతం ఇరు పార్టీలపై ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు తాజాగా ఈ వివాదంలోకి ప్రవేశించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి కుటుంబాలకు సంబంధించిన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు చేస్తున్న ఆస్తుల ఆరోపణల్లో వాస్తవాలు ఏంటో తేల్చేందుకు సమగ్ర విచారణ చేపట్టాలని రఘునందన్ రావు తన ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నిజానిజాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
తన ఫిర్యాదును ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)గా స్వీకరించడంతో పాటు, అవసరమైతే చట్టపరంగా తగిన ఇతర రూపంలోనైనా విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరినట్లు రఘునందన్ రావు వెల్లడించారు.
రేవంత్ రెడ్డి, కేటీఆర్‌తో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పరం చేసుకుంటున్న ఆస్తుల ఆరోపణలపై స్వతంత్రంగా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అక్టోబర్ 2న తాను చేసిన ప్రకటనకు అనుగుణంగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు అందజేసినట్లు తెలిపారు.
ఈ వ్యవహారానికి సంబంధించి పత్రికల్లో ప్రచురితమైన కథనాలు, నేతలు చేసిన ఆరోపణలకు సంబంధించిన వివరాలను సేకరించి, అందుబాటులో ఉన్న ఆధారాలు, అవసరమైన పత్రాలను ఫిర్యాదుకు జత చేసినట్లు రఘునందన్ రావు వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ.. వాటిపై న్యాయపరమైన విచారణ కోరేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. అందుకే తానే నేరుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించినట్లు తెలిపారు.
కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయలు దోచుకుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు. అదే సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండున్నరేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి రూ.50 వేల కోట్లు సంపాదించారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని తెలిపారు.
ఇరు పార్టీల నేతలు చేస్తున్న ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందో తేల్చేందుకు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ చేపట్టాలని రఘునందన్ రావు కోరారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తులతో పాటు, వాటికి అదనంగా మరే ఇతర ఆస్తులు సమకూర్చుకున్నారా అనే అంశాన్ని కూడా విచారణలో పరిశీలించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
నేతలు పరస్పరం చేస్తున్న ఆరోపణలు నిజమా, అవాస్తవమా అన్నది న్యాయ విచారణ ద్వారానే తేలాలని రఘునందన్ రావు అన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిగితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ప్రజలకు నిజానిజాలు స్పష్టంగా తెలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
