
టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా టెవోల్డే గెబ్రెమారియం (Tewolde Gebremariam) నియమితులయ్యారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయనను తొలుత పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) సీఈఓగా నియమించాలని భావించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. భద్రతా అనుమతుల ప్రక్రియ పూర్తైన తర్వాత ఆయన పేరును అధికారికంగా ప్రకటించాలని పీఐఏ యోచించినప్పటికీ, ఆలోపే ఎయిర్ ఇండియా ఆయనను తన కొత్త సీఈఓగా నియమించినట్లు సమాచారం.
భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఇటీవల ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసింది. సంస్థను తిరిగి లాభాల బాట పట్టించేందుకు టెవోల్డే నాయకత్వం అవసరమని పాక్ ప్రభుత్వం భావించింది. విమానాల ఆధునీకరణ, అంతర్జాతీయ రూట్ల విస్తరణ, నిర్వహణ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి సంస్థను పునరుద్ధరించాలని ప్రణాళిక రూపొందించింది. అయితే భద్రతా క్లియరెన్స్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
ఈ పరిణామాల మధ్య ఎయిర్ ఇండియా వేగంగా నిర్ణయం తీసుకుని టెవోల్డే గెబ్రెమారియంను సీఈఓగా నియమించింది. ఆయన గతంలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ సీఈఓగా పనిచేసి ప్రపంచ విమానయాన రంగంలో విశేష గుర్తింపు పొందారు. 2011 నుంచి 2022 వరకు ఆయన నాయకత్వంలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ వేగంగా విస్తరించి ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన ఎయిర్‌లైన్ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. అలాగే ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాను ఆఫ్రికాలో కీలక అంతర్జాతీయ విమానయాన హబ్‌గా అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. విమానాల సంఖ్య, అంతర్జాతీయ గమ్యస్థానాలు, నిర్వహణ సామర్థ్యాలను గణనీయంగా పెంచారు.
2022లో ఆరోగ్య కారణాల వల్ల పదవీ విరమణ చేసిన టెవోల్డే, ఇప్పుడు ఎయిర్ ఇండియా పగ్గాలు చేపట్టనున్నారు. తన నియామకంపై స్పందించిన ఆయన, ఎయిర్ ఇండియాకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. సంస్థను మరింత విశ్వసనీయమైన, లాభదాయకమైన, ప్రపంచస్థాయి పోటీకి సిద్ధమైన విమానయాన సంస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

