
ఆగస్ట్ 15 నుంచి తెలంగాణలో కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. అదే రోజు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ జరగనుంది. సుమారు 1.05 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులకు పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అందించనుంది. క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంశుభవార్త చెప్పింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుండగా.. అదే రోజు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల మంది లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందించనున్నారు. ఇప్పటివరకు ఆన్లైన్లో కార్డులు మంజూరైనా.. భౌతికంగా కార్డులు అందని కుటుంబాలకు కూడా ఈ పంపిణీ ద్వారా ఉపశమనం లభించనుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఈసారి పంపిణీ చేసే రేషన్ కార్డులను ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు. పీవీసీ మెటీరియల్‌తో తయారు చేసిన లామినేటెడ్ స్మార్ట్ కార్డులపై క్యూఆర్ కోడ్‌తో పాటు భద్రతా ఫీచర్లను ఏర్పాటు చేశారు. వాటర్‌ప్రూఫ్‌గా, క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉండే ఈ స్మార్ట్ కార్డులు ఎక్కువ కాలం ఉపయోగపడేలా తయారు చేశారు.
ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రేషన్ లబ్ధిదారుల తుది జాబితాల పరిశీలన, ఈ-కేవైసీ పూర్తి చేయడం, కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాటు వంటి అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

