
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ బకాయిలు ఉన్న ప్రైవేటు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు ప్రభుత్వం ఊరట కల్పించింది. పెండింగ్ బిల్లుల వసూళ్ల కోసం వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) పథకానికి ఏపీఈఆర్‌సీ అనుమతి ఇచ్చింది. ఈ పథకం 2027 జూన్ వరకు అమల్లో ఉంటుంది.
బకాయిల్లో 50 శాతం చెల్లిస్తే చాలు!
రాష్ట్రంలో ఓటీఎస్ పరిధిలోకి వచ్చే విద్యుత్ బకాయిలు సుమారు రూ.800 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇందులో వడ్డీ, పెనాల్టీల మినహాయింపు ద్వారా వినియోగదారులకు దాదాపు రూ.400 కోట్ల మేర ప్రయోజనం కలగనుంది. అర్హులైన వినియోగదారులు పథకం నిబంధనల ప్రకారం బకాయిల్లో 50 శాతం చెల్లించి సెటిల్ చేసుకోవచ్చు.
ఎవరికి వర్తిస్తుంది?
కనీసం ఏడాది కాలంగా బిల్లులు చెల్లించని ఎల్టీ, హెచ్‌టీ వినియోగదారులకు ఈ పథకం వర్తిస్తుంది. ఏడాదిలోపు బకాయిలు, ఎన్‌సీఎల్‌టీ వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన బకాయిలకు మినహాయింపు వర్తించదు.
బకాయిలు చెల్లిస్తే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
ఓటీఎస్ కింద బకాయిలు సెటిల్ చేసుకున్న వారికి డిస్కంలు అదనపు ఛార్జీలు లేకుండా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తాయి. అయితే, కనెక్షన్ వైర్‌ను పూర్తిగా తొలగించినట్లయితే తిరిగి కనెక్షన్ కోసం నిర్దేశిత ఛార్జీలు చెల్లించాలి.
డిస్కంలపై బకాయిల భారం
పరిశ్రమలు, వాణిజ్య సంస్థల నుంచి విద్యుత్ బిల్లుల వసూళ్లలో జాప్యం కారణంగా డిస్కంల వద్ద భారీగా బకాయిలు పేరుకుపోయాయి. గతంలో 2022 డిసెంబర్ 31 వరకు మాత్రమే ఓటీఎస్ అమల్లో ఉండటంతో మరోసారి అవకాశం కల్పించాలని డిస్కంలు కోరాయి. దీనికి ఏపీఈఆర్‌సీ అనుమతి ఇచ్చింది. అర్హులైన వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
