
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో టీడీపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి స్పష్టం చేశారు. సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురైనా, పార్టీ తరఫున బీసీలకు 34 శాతం టికెట్లు కేటాయిస్తామని వెల్లడించారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు స్థానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు. రాజకీయాల్లో బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించి, అభివృద్ధి చేసింది టీడీపీనేనని అన్నారు.
బీసీలకు మేలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, గొడ్డలి పార్టీ అడ్డుకునేందుకు యత్నిస్తోందని గల్లా మాధవి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌కు అనుకూలంగా వాదనలు వినిపించిన న్యాయవాది గత వైసీపీ ప్రభుత్వంలో ఏజీపీగా పనిచేశారని తెలిపారు.
బీసీలకు వ్యతిరేకంగా వాదనలు జరుగుతున్న సమయంలో ఆ పార్టీ ఎందుకు స్పందించలేదో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం వైసీపీకి అలవాటుగా మారిందని ఆమె విమర్శించారు. ఆ పార్టీ అధ్యక్షుడు చేసిన స్కాంల నుంచి బయటపడేందుకు బీసీ నాయకులను రక్షణగా పెట్టుకున్నారని ఆరోపించారు.
వైసీపీ హయాంలో అనేక మంది బీసీ నేతలు కేసుల్లో చిక్కుకున్నారని, గత ప్రభుత్వం బీసీలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించిందని మండిపడ్డారు. బీసీలకు వైసీపీ చేసిన ద్రోహాన్ని ఆ వర్గాలు మరిచిపోలేదని, భవిష్యత్తులోనూ మరిచిపోవని గల్లా మాధవి వ్యాఖ్యానించారు.
