ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై కసరత్తు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో, ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశంపై ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ సర్దుబాటులో భాగంగా జనసేన పార్టీ నాలుగు కార్పొరేషన్లతోపాటు 20కి పైగా మున్సిపాలిటీల్లో పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, బీజేపీకి ఒక కార్పొరేషన్‌తోపాటు ఆరుకు పైగా మున్సిపాలిటీలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సీట్ల పంపకాలపై కూటమి నేతలు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పోటీ చేసే స్థానాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో అధికార కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగానే బరిలోకి దిగనున్నట్లు జనసేన పార్టీ వెల్లడించింది.

సీట్ల కేటాయింపుపై జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయని పార్టీ వర్గాలు తెలిపాయి. జనసేన ఆత్మగౌరవానికి భంగం కలగకుండా, పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ స్థానికంగా ఆయా పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుని సీట్ల పంపకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, అభ్యర్థుల బలాన్ని అంచనా వేసి స్థానాల కేటాయింపుపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయించారనే వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

జనసేనకు నాలుగు మేయర్‌ స్థానాలు? మున్సిపాలిటీల జాబితా ఇదే!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం జనసేన పార్టీకి నాలుగు మేయర్‌ స్థానాలు, 20 నుంచి 24 మున్సిపాలిటీలు, మూడు నుంచి నాలుగు నగర పంచాయతీల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు, బీజేపీకి ఒక మేయర్‌ స్థానం, నాలుగు నుంచి ఐదు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ కేటాయించే అవకాశముందని తెలుస్తోంది.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ విషయంలో జనసేన, బీజేపీ రెండూ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ స్థానాన్ని ఏ పార్టీకి కేటాయిస్తారనే అంశంపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత రావచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

జనసేనకు కేటాయించిన మేయర్‌ స్థానాలివేనా?

ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం విజయవాడ, కాకినాడ, శ్రీకాకుళం, ఏలూరు మేయర్‌ స్థానాలను జనసేనకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వివరాలపై కూటమి నేతల నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

జనసేన పోటీ చేసే అవకాశం ఉన్న మున్సిపాలిటీల జాబితాలో పిఠాపురం, పెద్దాపురం, గొల్లప్రోలు, తుని, అమలాపురం, మండపేట, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, రంపచోడవరం, జగ్గయ్యపేట, రేపల్లె, తెనాలి, పొన్నూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, దర్శి, కావలి, శ్రీకాళహస్తి, మదనపల్లె, పుట్టపర్తి, ఆదోని ఉన్నట్లు సమాచారం.

అలాగే పాలకొండ, నెల్లిమర్ల, ముమ్మిడివరం, మడకశిర నగర పంచాయతీల్లోనూ జనసేన పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే, ఈ జాబితాలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.

బీజేపీకి ఏయే స్థానాలు దక్కనున్నాయి?

మరోవైపు, బీజేపీకి రాజమహేంద్రవరం మేయర్‌ స్థానంతోపాటు యలమంచిలి, బాపట్ల, శ్రీకాళహస్తి, ఎర్రగుంట్ల, కర్నూలు జిల్లాలోని గూడూరు మున్సిపాలిటీల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ స్థానాల కేటాయింపుపైనా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

స్థానిక రాజకీయ పరిస్థితులు, ఆయా ప్రాంతాల్లో పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుని జాబితాలో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వివరాలు ప్రాథమిక సమాచారం మాత్రమే. కూటమి నేతలు అధికారికంగా సీట్ల పంపకాల జాబితాను ప్రకటించిన తర్వాతే ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందనే అంశంపై పూర్తి స్పష్టత రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *