ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు ఏపీ హైకోర్టు తీర్పుతో తెరపడింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పలు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆరు వారాల్లోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 105, 1065ను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు నిర్దేశించిన పరిమితులకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్లు వాదించారు. మరోవైపు సమకాలీన బీసీ జనాభా లెక్కలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగానే 34 శాతం రిజర్వేషన్లను నిర్ణయించినట్లు ప్రభుత్వం కోర్టుకు వివరించింది.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పైనా హైకోర్టు విచారణ చేపట్టింది. బీసీ జనగణన, సమగ్ర సర్వే పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించవద్దంటూ దాఖలైన పిటిషన్లతో పాటు వార్డుల పునర్విభజన, గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేయడాన్ని సవాల్ చేసిన వ్యాజ్యాలను కూడా కోర్టు పరిశీలించింది.

తాజా ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చినప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్, ఇతర ప్రక్రియలపై రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

By Rajini