
ఆంధ్రప్రదేశ్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పలువురు నేతల కుటుంబ సభ్యులు ఎన్నికల బరిలో నిలవగా, మరికొందరు పార్టీలు మారుతూ చర్చనీయాంశంగా మారారు.
మంత్రి మండిపల్లి కుటుంబం నుంచి నాలుగు నామినేషన్లు
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలం పడమటికోన ఎంపీటీసీ స్థానం నుంచి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తల్లి సుశీలమ్మ, భార్య హరితమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి టీడీపీ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇదే స్థానానికి మంత్రికి వరుసకు సోదరుడైన పి. దేవనాథరెడ్డి వైఎస్సార్సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు.
సుశీలమ్మ, హరితమ్మల్లో ఎవరు తుది బరిలో నిలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. వీరిలో ఒకరు చిన్నమండెం ఎంపీపీ అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
పార్టీలు మారుతున్న నేతలు
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నేత చల్లమల్ల సుజీరాజు తొలుత జనసేనలో చేరి, రెండు రోజులకే తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. ఆయన భార్య గతంలో జెడ్పీటీసీ సభ్యురాలిగా పనిచేశారు.
మరోవైపు, గొల్లప్రోలు మండలం కొడవలికి చెందిన జి. ఝాన్సీ తొలుత జనసేన కండువాతో ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేయగా, తాజాగా బీజేపీ కండువాతో మరో నామినేషన్ దాఖలు చేశారు. కూటమి పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి దక్కే అవకాశం ఉందనే ప్రచారంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ తర్వాత తుది బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది.
