
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను ఈ ఏడాది నవంబరు నుంచి పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పర్యావరణ అనుమతులు లభించినందున పనులు వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో జలవనరుల సమర్థ నిర్వహణ నదుల అనుసంధానానికి ప్రాధాన్యమిస్తూ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని స్పష్టం చేశారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో గుర్తించిన 36 ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 2028 డిసెంబరు నాటికి అన్ని ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు, ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జల హారతి కార్పొరేషన్ ద్వారా జలవనరుల శాఖకు ఆదాయం సమకూర్చే మార్గాలను అన్వేషించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పోలవరం పనులపై ప్రత్యేక దృష్టి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్వాసితులకు చెల్లింపులు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 90.2 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిపుణుల కమిటీ పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి నిర్మాణ పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిందని తెలిపారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం గడువు విధించారు.
నదుల అనుసంధానానికి కార్యాచరణ
గోదావరి-పెన్నా నదుల అనుసంధానంపై కార్యాచరణ ప్రారంభించాలని, గోదావరి నుంచి కావేరి వరకు నీటిని తరలించే అవకాశాలపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన వైకుంఠపురం, చోడవరం వద్ద ఆనకట్టలు నిర్మించడం ద్వారా 14 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలన్నీ సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలువల వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు భద్రాచలం నుంచి రాజమహేంద్రవరం, విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు అంతర్గత జల రవాణాను అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
జలధార-జలహారతికి 150 రోజుల కార్యాచరణ
జలధార-జలహారతి రెండో దశ పనులను వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగించాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని 150 రోజుల కార్యాచరణగా అమలు చేస్తూ ‘వీబీజీ రామ్ జీ’తో అనుసంధానం చేయాలని సూచించారు. 2027 ఏప్రిల్ 1 నుంచి మూడో దశను ప్రారంభించాలని తెలిపారు.
భూగర్భ జలమట్టాలను మూడు మీటర్లకు పైగా పెంచే లక్ష్యంతో చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. జలధార-జలహారతిని నిరంతర కార్యక్రమంగా కొనసాగిస్తూ వర్షపు నీటిని ఒడిసిపట్టాలని, చెరువులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలను పెంచాలని సూచించారు.
