
జగనన్న కాలనీల్లో ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీగా ఉన్న ప్లాట్లను కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించడంతో పాటు, ప్రస్తుత లబ్ధిదారులకు మరింత వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
ఇళ్ల నిర్మాణంపై ఆసక్తి ఉన్న అర్హులైన వారికి ఖాళీగా ఉన్న ప్లాట్లను కేటాయించేలా చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే ప్లాట్లు పొందిన లబ్ధిదారులు తమకు కేటాయించిన స్థలం వద్దనుకుంటే, వారి అభీష్టం మేరకు మరో ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలం కల్పించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. లబ్ధిదారుల ఇబ్బందులను పరిష్కరించడం, ఖాళీగా ఉన్న ప్లాట్లను సద్వినియోగం చేయడం, అర్హులైన వారికి స్థలాలు అందేలా చర్యలు తీసుకోవడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా ఉండనుంది.
ఈ క్రమంలో ప్రస్తుత లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసి, వారి అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ఉంది. ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చే వారికి ప్రాధాన్యతనిస్తూ, ఇళ్ల స్థలాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో ఈ అంశంపై చర్చించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలను 45 రోజుల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు మరో మంత్రి కందుల దుర్గేష్ లేదా మంత్రి నాదెండ్ల మనోహర్ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు.
గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన జగనన్న కాలనీల్లోని ఇళ్ల స్థలాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయా స్థలాల లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసి, ఇళ్లు నిర్మించుకునేందుకు వారు సుముఖంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలని నిర్ణయించింది.
ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి లేని లబ్ధిదారుల స్థితిగతులను పరిశీలించడంతో పాటు, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.
జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చే లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అయితే, ప్రస్తుతం కేటాయించిన ప్రాంతంలో ఇల్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపని లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతంలో ఇళ్ల స్థలం కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
కొన్ని లేఅవుట్లలో సరైన రవాణా సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించేందుకు సుముఖంగా లేరని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ఆయా సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే లేఅవుట్లలో ఖాళీగా ఉన్న స్థలాలు, లబ్ధిదారులు వద్దనుకున్న ప్లాట్లను గుర్తించి, అవసరమైతే వాటి రిజిస్ట్రేషన్లను రద్దు చేసి అర్హులైన కొత్త లబ్ధిదారులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కమిటీకి సూచించారు.
ఇటీవల నిర్వహించిన ఆవాస్ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అవసరమని గుర్తించారు. వీరికి స్థలాలు కేటాయించేందుకు అవసరమైన భూమిని ఎలా సమీకరించాలనే అంశంపైనా కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
భూసేకరణలో అక్రమాలపై చర్యలు
గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూసేకరణలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి ఇప్పటికే నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు బాధ్యులుగా తేలిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
3.71 లక్షల ఇళ్లను రద్దు చేసిన కేంద్రం
మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) అర్బన్-1.0 కింద గత ప్రభుత్వ హయాంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు భారీగా ఇళ్లు మంజూరు చేసింది. అయితే మంజూరైన ఇళ్లలో 3.71 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఇళ్లను రద్దు చేసింది.
వాస్తవానికి PMAY అర్బన్-1.0 పథకం గడువు 2024 డిసెంబర్‌తో ముగిసింది. అయితే కూటమి ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరడంతో గడువును రెండుసార్లు పొడిగించారు. తాజాగా 2026 జూలైని ప్రాతిపదికగా తీసుకుని నిర్మాణం ప్రారంభించని ఇళ్లను రద్దు చేసినట్లు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
అయితే రద్దు చేసిన ఇళ్లలో 1.27 లక్షల ఇళ్లకు ఇప్పటికే జియోట్యాగింగ్ పూర్తయిందని ఏపీ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. వీటిని తిరిగి పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరింది. మిగిలిన 2.44 లక్షల ఇళ్లను PMAY అర్బన్-2.0 పథకంలోకి మార్చాలని విజ్ఞప్తి చేసింది.
ఏపీ ప్రభుత్వం చేసిన ఈ విజ్ఞప్తిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
