విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థ అడుగుపెట్టనుంది. నగరంలో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్‌కు యూజీసీ అనుమతి మంజూరు చేసింది.

ఈ అనుమతితో భారత్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు యూజీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందిన తొలి అమెరికన్ పబ్లిక్ యూనివర్సిటీగా యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్ నిలవనుంది. అలాగే, తెలంగాణలో క్యాంపస్ ఏర్పాటు చేయనున్న తొలి విదేశీ యూనివర్సిటీగా కూడా గుర్తింపు పొందనుంది.

2027 ఆగస్టులో హైదరాబాద్ క్యాంపస్‌లో తొలి బ్యాచ్‌ను ప్రారంభించాలని యూనివర్సిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో బిజినెస్, కంప్యూటింగ్, ఇంజినీరింగ్, అనలిటిక్స్ వంటి విభాగాల్లో వివిధ కోర్సులను అందించనుంది. ఈ క్యాంపస్ ద్వారా అంతర్జాతీయ స్థాయి విద్యను హైదరాబాద్ విద్యార్థులకు మరింత చేరువ చేసే అవకాశం ఉంది.

తెలంగాణ విద్యారంగంలో మరో కీలక ముందడుగు పడింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలకు వేదికగా నిలిచిన హైదరాబాద్‌లోకి ఇప్పుడు అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ అడుగుపెట్టనుంది. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్ (సీయూ డెన్వర్).. హైదరాబాద్‌లో డిగ్రీలు ప్రదానం చేసే క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) పొందింది.

ఈ అనుమతితో భారత్‌లో డిగ్రీ ప్రదానం చేసే క్యాంపస్ ఏర్పాటుకు ఎల్ఓఐ పొందిన తొలి అమెరికన్ పబ్లిక్ యూనివర్సిటీగా సీయూ డెన్వర్ నిలవనుంది. అంతేకాకుండా తెలంగాణలో క్యాంపస్ ఏర్పాటు చేయనున్న తొలి విదేశీ యూనివర్సిటీగా కూడా గుర్తింపు పొందనుంది.

హైదరాబాద్ క్యాంపస్‌లో తొలి బ్యాచ్ విద్యార్థులను 2027 ఆగస్టులో చేర్చుకోవాలని సీయూ డెన్వర్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే క్యాంపస్ ప్రారంభానికి ముందు అవసరమైన అన్ని అనుమతులు, అధికారిక ప్రక్రియలు పూర్తికావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి సంబంధిత సంస్థలతో యూనివర్సిటీ ప్రస్తుతం సంప్రదింపులు కొనసాగిస్తోంది.

తొలి దశలో విద్యార్థుల్లో డిమాండ్ ఉన్న రంగాల్లో కోర్సులను ప్రారంభించాలని సీయూ డెన్వర్ ప్రణాళిక రూపొందించింది. ముఖ్యంగా బిజినెస్, కంప్యూటింగ్, ఇంజినీరింగ్, అనలిటిక్స్ విభాగాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. కేవలం తరగతి గది బోధనకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ లెర్నింగ్, పరిశ్రమలతో అనుసంధానం, ఉద్యోగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు యూనివర్సిటీ వెల్లడించింది.

హైదరాబాద్ క్యాంపస్‌లో ప్రారంభ దశలో అందించనున్న కోర్సులే తుది జాబితా కాదని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్ (సీయూ డెన్వర్) స్పష్టం చేసింది. క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభమైన రెండో సంవత్సరం నుంచి విద్యార్థుల డిమాండ్, పరిశ్రమ అవసరాలను బట్టి మరిన్ని ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టేందుకు యూజీసీ అనుమతులు కోరనున్నట్లు తెలిపింది.

హైదరాబాద్ క్యాంపస్‌లో చదువుకునే విద్యార్థులకు అమెరికాలోని డెన్వర్ మెయిన్ క్యాంపస్‌తో నిరంతర విద్యాపరమైన అనుసంధానం ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు, స్థానిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యమని సీయూ డెన్వర్ పేర్కొంది.

హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటుపై సీయూ డెన్వర్ ఛాన్సలర్ కెన్నెత్ టీ. క్రిస్టెన్సన్ స్పందిస్తూ.. భారతీయ విద్యార్థులతో తమ యూనివర్సిటీకి దశాబ్దాలుగా బలమైన అనుబంధం ఉందని తెలిపారు. ఇక భారత్‌లోనే విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యతో పాటు, వారి కెరీర్‌కు ఉపయోగపడే నైపుణ్యాలను అందించే అవకాశం లభించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

విద్యా విధానంలో అప్లైడ్ లెర్నింగ్, ఇంటర్‌డిసిప్లినరీ ఎడ్యుకేషన్, కెరీర్ రెడీనెస్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు యూనివర్సిటీ వెల్లడించింది. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా.. వాటిని వాస్తవ జీవిత సమస్యలకు అన్వయించేలా ప్రాక్టికల్ విధానంలో శిక్షణ అందించనున్నట్లు తెలిపింది