• అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంద్ర పుష్కరిణిని సందర్శించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులతో ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.
  • ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద అరసవల్లి ఆలయ అభివృద్ధికి రూ.55.74 కోట్లు కేటాయించడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌కు శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
  • ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారంతో గత రెండేళ్లుగా అరసవల్లి క్షేత్ర అభివృద్ధికి చేసిన కృషికి ఈ నిధుల కేటాయింపు ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. స్వదేశీ దర్శన్ ప్రాజెక్టు నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేస్తామని రెండేళ్లలోపు ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
  • అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి దేశ, విదేశాల నుంచి భక్తుల రాక పెరుగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రతి ఆదివారం సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
  • గత రెండేళ్లుగా రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ఆలయాలు, సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తోందన్నారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించడం సంతోషకరమని పేర్కొన్నారు.

By Rajini