• జీవీఎంసీ (GVMC) సాధారణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి మళ్లిస్తోందంటూ సోషల్ మీడియా ఇతర వేదికల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. ఆర్థిక రికార్డులకు ఎలాంటి పొంతన లేని నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఖండించారు.
  • జీవీఎంసీ సాధారణ నిధుల నుంచి కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లులకు సంబంధించిన రికార్డులను కమిషనర్ ఈ సందర్భంగా విడుదల చేశారు. రికార్డుల ప్రకారం, 2019-20 నుంచి 2026-27 వరకు మొత్తం 24,128 బిల్లులకు రూ.2,620.28 కోట్లను సాధారణ నిధుల నుంచి చెల్లించినట్లు తెలిపారు.
  • అలాగే, 2025-26 నుంచి 2026-27 వరకు గత రెండేళ్లలోనే 6,057 బిల్లులకు రూ.940.17 కోట్ల చెల్లింపులు జరిగాయని వివరించారు. ఇటీవల కూడా 2025 నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన బిల్లుల కింద 2026 సెప్టెంబర్ 7న రూ.95 కోట్లను జీవీఎంసీ విడుదల చేసినట్లు తెలిపారు.
  • విశాఖపట్నం నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో కాంట్రాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కేతన్ గార్గ్ పేర్కొన్నారు. జీవీఎంసీ వద్ద అందుబాటులో ఉన్న నిధులను బట్టి, ప్రాధాన్యతా క్రమంలో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులను కొనసాగిస్తున్నామని చెప్పారు.
  • నిధుల మళ్లింపుపై ఆధారాలు లేని ప్రచారాన్ని నమ్మి ప్రజలు గందరగోళానికి గురికావద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ రికార్డులకు విరుద్ధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా సంస్థ ప్రతిష్టను దెబ్బతీయవద్దని ఆయన హెచ్చరించారు.

By Rajini