
వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరానికి చేరుకోవాలి: విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్
అమరావతి, ఆంధ్రప్రభ: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ అల్పపీడనం ఆదివారం నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని, ఆ తర్వాతి మూడు రోజుల్లో మరింత బలపడి కోస్తాంధ్ర తీరానికి చేరే సూచనలు ఉన్నాయని తెలిపారు.
సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు
తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో శుక్రవారం రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు.
సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేశారు. తీర ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
మత్స్యకారులు వెంటనే వెనక్కి రావాలి
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని కోరారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు.
