
ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలవనున్న భోగాపురం అలూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు భోగాపురం చేరుకుని ఈ ప్రతిష్ఠాత్మక విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో భోగాపురం పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. దాదాపు 7,000 మంది పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేయగా, భూమి, గగనతలం, సముద్ర మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. చింతపల్లి మెరైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 29 కిలోమీటర్ల తీర ప్రాంతంలో మెరైన్ పోలీసులు నిరంతర గస్తీ నిర్వహిస్తున్నారు.
ప్రధాని పర్యటన షెడ్యూల్
- ఉ. 10:45: ప్రత్యేక విమానంలో భోగాపురం విమానాశ్రయానికి చేరిక.
- ఉ. 10:55: 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్య ప్రదర్శనతో సాంప్రదాయ స్వాగతం.
- ఉ. 11:00: టెర్మినల్ భవనం, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల పరిశీలన.
- ఉ. 11:30: విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరణ.
- మ. 12:55 వరకు: భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగం.
- మ. 1:05: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపు
సుమారు 2,200 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ స్థాయి అనుసంధానాన్ని కల్పించనుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, లాజిస్టిక్స్, ఎగుమతులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు ఇది కీలక కేంద్రంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో విశాఖపట్నం విమానాశ్రయంపై ఉన్న రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంది. భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరగడంతో పాటు ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు ప్రధాన చోదకశక్తిగా నిలుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

