దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల సీజన్ తీవ్ర వర్షపాత లోటుతో ముగిసింది. రానున్న అక్టోబర్‌–డిసెంబర్‌ కాలంలోనూ దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ముఖ్యంగా అక్టోబర్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉండొచ్చని తెలిపింది.

పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్‌నినో పరిస్థితుల ప్రభావం దీనికి ప్రధాన కారణంగా వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు కొనసాగిన నైరుతి రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే కేవలం 87 శాతం వర్షపాతమే నమోదైంది. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా 759.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా 2001 తర్వాత ఇది నాలుగో అత్యల్ప వర్షపాతంగా, 1901 నుంచి లెక్కిస్తే 13వ అత్యల్పంగా నమోదైంది.

ప్రాంతాల వారీగా చూస్తే తూర్పు, ఈశాన్య భారతంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రాంతంలో కేవలం 1,016.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, 1901 తర్వాత అత్యల్ప వర్షపాతంగా రికార్డయ్యింది. దక్షిణ ద్వీపకల్పంలో 542 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవగా 2001 తర్వాత ఇది రెండో అత్యల్ప వర్షపాతంగా నిలిచింది. వ్యవసాయానికి అత్యంత కీలకమైన మాన్సూన్‌ కోర్‌ జోన్‌లోనూ వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి.

ఈ ప్రాంతంలో 779.9 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దేశంలోని మొత్తం 36 వాతావరణ సబ్‌డివిజన్లలో 17 చోట్ల లోటు వర్షపాతం నమోదైంది. మరో 18 సబ్‌డివిజన్లలో సాధారణ వర్షపాతం నమోదు కాగా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైన ఏకైక సబ్‌డివిజన్‌గా ఒడిశా నిలిచింది. ఇక అక్టోబర్‌లోనూ వర్షాభావ పరిస్థితులు కొనసాగితే వ్యవసాయం, జలవనరులు, ఉష్ణోగ్రతలపై దాని ప్రభావం కనిపించే అవకాశం ఉంది.

By Rajini