వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ సంస్థాగతంగా కీలక మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. మహిళలు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ పలు కీలక పదవుల్లో కొత్తవారికి అవకాశం ఇచ్చారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని నియమించారు. జాతీయ ఉపాధ్యక్షులుగా 13 మందికి బాధ్యతలు అప్పగించగా.. వారిలో ఆరుగురు మహిళలు ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ నుంచి రాంమాధవ్, దగ్గుబాటి పురందేశ్వరికి చోటు దక్కింది. అలాగే రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియాను కూడా జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. తెలంగాణకు చెందిన నేతలకు కొత్త కార్యవర్గంలో చోటు దక్కలేదు. ఇప్పటివరకు జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణను తప్పించారు.

మరోవైపు జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణువర్ధన్ రెడ్డిని నియమించారు. కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్ బాధ్యతలను తరుణ్ చుగ్‌కు అప్పగించారు. ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న లక్ష్మణ్ స్థానంలో అమర్‌పాల్ మౌర్యను నియమించారు.

వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాజిక సమీకరణాలు, మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇస్తూ బీజేపీ చేపట్టిన ఈ సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.

By Ramya