
క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఎన్నో సంవత్సరాలు గడిచినా.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ విలువ మాత్రం ఇప్పటికీ బలంగానే కొనసాగుతోంది. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సచిన్.. రిటైర్మెంట్ తర్వాత కూడా దేశంలోని అత్యంత ప్రభావవంతమైన సెలబ్రిటీ బ్రాండ్లలో ఒకరిగా నిలుస్తున్నారు. క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూ 2025 నివేదిక ప్రకారం.. సచిన్ బ్రాండ్ విలువ 125.9 మిలియన్ డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.1,189 కోట్లకు సమానం. ఈ విలువతో ఆయన దేశంలోని టాప్-5 సెలబ్రిటీ బ్రాండ్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
అంతేకాదు.. భారత టాప్-10 సెలబ్రిటీ బ్రాండ్ల జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక మాజీ క్రికెటర్‌గా కూడా సచిన్ కొనసాగుతున్నారు. ప్రజల్లో ఆయనకున్న నమ్మకం, గౌరవం, విశ్వసనీయత కారణంగానే బ్రాండ్ విలువలో స్థిరమైన ప్రభావం కనిపిస్తోందని విశ్లేషణలు చెబుతున్నాయి. దీంతో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలకు సచిన్ ఇప్పటికీ ప్రముఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆకర్షణీయమైన ఎంపికగా ఉన్నారు.
క్రికెట్లో సచిన్ నెలకొల్పిన అద్భుతమైన రికార్డులు కూడా ఆయన బ్రాండ్ ఇమేజ్‌కు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తన కెరీర్లో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సచిన్.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు. టెస్టులు, వన్డేల్లో కలిపి అత్యధిక సెంచరీలు చేసిన ఘనత కూడా ఆయన ఖాతాలోనే ఉంది.
అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ మొత్తం 34,357 పరుగులు సాధించారు. రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులను తన పేరుపై లిఖించుకున్నారు. వాటిలో అనేక ఘనతలు ఇప్పటికీ ప్రత్యేకంగానే నిలిచాయి. సచిన్ ఏకంగా 200 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. టెస్టు క్రికెట్లో 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించారు. టెస్టుల్లో సచిన్ 15,921 పరుగులు చేయగా.. ఇందులో 51 సెంచరీలు ఉన్నాయి. 15,000 టెస్టు పరుగుల మైలురాయిని కేవలం 300 ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకోవడం ఆయన బ్యాటింగ్ సామర్థ్యానికి నిదర్శనం.
వన్డే క్రికెట్లోనూ సచిన్ పేరిట అనేక అరుదైన రికార్డులు ఉన్నాయి. 22 సంవత్సరాల 91 రోజుల పాటు కొనసాగిన ఆయన వన్డే కెరీర్.. ఈ ఫార్మాట్లో సుదీర్ఘమైన కెరీర్లలో ఒకటిగా నిలిచింది. 1998లో ఒకే క్యాలెండర్ ఇయర్లో 1,894 పరుగులు, 9 సెంచరీలు సాధించిన రికార్డు ఇప్పటికీ ప్రత్యేకంగానే ఉంది. వన్డేల్లో సచిన్ 145 అర్ధ సెంచరీలు సాధించడంతో పాటు 2,016 ఫోర్లు బాదారు. 18,000 వన్డే పరుగుల మైలురాయిని 440 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకున్నారు.
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా సచిన్‌పై అభిమానుల్లో ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. మైదానంలో నెలకొల్పిన రికార్డులతో పాటు.. ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠ, విశ్వసనీయత, ప్రజల్లో ఉన్న అపారమైన గౌరవం ఇప్పటికీ సచిన్‌ను దేశంలోని అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్లలో ఒకరిగా నిలబెడుతున్నాయి.

