
బీహార్ ప్రభుత్వం సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్ఫ్లూయెన్సర్లకు భారీ నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేసే క్రియేటర్లకు రూ.లక్ష వరకు నగదు బహుమతి అందించనుంది.
ఈ మేరకు రాష్ట్ర సోషల్ మీడియా విధానంలో చేసిన కీలక సవరణలకు బీహార్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సమాచార, ప్రజా సంబంధాల విభాగం (IPRD)లో నమోదు చేసుకున్న క్రియేటర్లకు వారి వీడియోలకు లభించే వ్యూస్ ఆధారంగా నగదు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడమే ఈ నిర్ణయం లక్ష్యంగా తెలుస్తోంది.
సోషల్ మీడియాలో కంటెంట్ రూపొందించే డిజిటల్ క్రియేటర్లు, ఇన్ఫ్లూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రచారం కల్పించేలా వీడియోలు రూపొందించి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసే వారికి భారీ నగదు ప్రోత్సాహకాలు అందించనుంది.
క్రియేటర్లకు గరిష్ఠంగా రూ.లక్ష వరకు నగదు బహుమతులు అందించేలా రాష్ట్ర సోషల్ మీడియా విధానంలో కీలక మార్పులు చేసింది. ఈ సవరణలకు బీహార్ రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు డిజిటల్ క్రియేటర్లను భాగస్వామ్యం చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
వ్యూస్ ఆధారంగా చెల్లింపులు..!
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, సాధించిన పురోగతిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కొత్త విధానం ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా డిజిటల్ క్రియేటర్లు రూపొందించే వీడియోలకు లభించే వ్యూస్ ఆధారంగా నగదు ప్రోత్సాహకాలను అందించనున్నారు.
ఈ నిబంధనల ప్రకారం.. ఒక వీడియోకు 1 లక్ష వ్యూస్ వస్తే రూ.10,000 వరకు పారితోషికం అందుతుంది. అదే వీడియో 10 లక్షల వ్యూస్ సాధిస్తే గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు నగదు బహుమతి పొందే అవకాశం ఉంటుంది.
అయితే 10 లక్షలకు మించి వ్యూస్ వచ్చినా.. ఒక్క వీడియోకు చెల్లించే ప్రోత్సాహకం రూ.1 లక్షకు మాత్రమే పరిమితం అవుతుంది. అంతేకాకుండా వీడియో వైరల్ అయినంత మాత్రాన ప్రతి క్రియేటర్‌కు నగదు బహుమతి లభించదు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, కంటెంట్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వీడియోలకు మాత్రమే ఈ ప్రోత్సాహక పథకం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

