
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో కొత్తగా మంజూరైన 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇదే సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ పైలట్ ప్రాజెక్టుకు కూడా శ్రీకారం చుట్టారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, CSIR-CBRI రూర్కీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నాయి.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) 2.0 కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల 3 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఇళ్ల కోసం కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో ఈ కేటాయింపు జరిగినట్లు అధికారులు తెలిపారు. బుర్రిపాలెంలో నిర్వహించిన కార్యక్రమంతో ఈ ఇళ్ల నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 5.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
గత ఏడాది నవంబర్‌లో 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించగా, ఈ ఏడాది మార్చిలో మరో 2.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మరో 4.20 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటిని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
