అమరావతిలో కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కీలక అప్డేట్ ఇచ్చారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించనున్న జీపీఆర్‌ఏ (జనరల్‌ పూల్‌ రెసిడెన్షియల్‌ అకామడేషన్‌) గృహ సముదాయానికి టెండర్ల దశలో ఉందన్నారు. ఈ నెల 12న హైదరాబాద్‌లో ప్రీ-బిడ్‌ సమావేశం ఉందన్నారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ముందడుగు పడిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,083 కోట్లు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి జూన్‌లో కేంద్రం కీలక ప్రాజెక్టును ప్రకటించింది. రాజధానిలో కేంద్ర ప్రభుత్వోద్యోగులకు అత్యాధునిక వసతులతో గృహ సముదాయం నిర్మించబోతోంది. మొత్తం రూ.1,083 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ నెల 12న హైదరాబాద్‌లో అర్హత ఉన్న బిడ్డర్ల కోసం ప్రీ-బిడ్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం అమరావతిలో ఈ ప్రాజెక్టును ఉద్యోగులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో చేపట్టిందన్నారు.

మొత్తం 28 నెలల్లో నిర్మాణ పనుల్ని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారని పెమ్మసాని తెలిపారు. ఈ ప్రాజెక్టులో 1,504 నివాస యూనిట్లను 11 హై-రైజ్‌ టవర్లలో నిర్మిస్తారని.. కామన్‌ డబుల్‌ లెవెల్‌ బేస్‌మెంట్ పార్కింగ్‌ సదుపాయం ఉంటుందన్నారు. అలాగే నివాస భవనాలతో పాటు జీ+4 అంతస్తుల అనుబంధ భవనం, గెస్ట్ హౌస్, కమ్యూనిటీ హాల్, కిచెన్, డైనింగ్‌హాల్, షాపులు వంటి సదుపాయాలు ఉంటాయనన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వ శాఖలలతో సమన్వయం చేయడంతో కేవలం రెండు నెలల్లోనే టెండర్ దశకు వచ్చిందన్నారు.

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు గృహ సదుపాయంతో పాటుగా.. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం సెంట్రల్‌ సెక్రటేరియట్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ కోసం రూ.1,299.08 కోట్లు ఖర్చు చేయనుంది. ఇప్పటికే సీఆర్‌డీఏ రాజధానిలో 22.53 ఎకరాలు కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్‌, 17 ఎకరాల్లో నివాస సముదాయం నిర్మాణం నిర్మించనున్నారు. ఈ భవనాలను అత్యాధునిక ఈసీఎస్‌బీసీ-2024 బిల్డింగ్‌ కోడ్, ఎకో-నివాస్‌ సంహిత 2024 ప్రమాణాలకు తగిన విధంగా నిర్మిస్తారు.

వాస్తవానికి 2018లోనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణం కోసం 22.53 ఎకరాలు కేటాయించింది. ఏపీ ఎన్‌ఆర్టీకి భవనం నిర్మిస్తున్న ప్రాంతానికి పక్కనే 5.53 ఎకరాలు సెంట్రల్‌ సెక్రటేరియట్‌ కోసం, ఐనవోలుకు సమీపంలో 17 ఎకరాల్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయానికి కేటాయించింది. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయత్నాలు ప్రారంభించగా కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.