
నంద్యాల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గోపాలరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కారణంతోనే ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు, కోర్టులో హాజరుపరచనున్నారు. ఆయన ఆస్తులు అన్నీ కలిపితే రూ. 2.89 కోట్లు ఉన్నాయని.. బయట మార్కెట్‌లో అవి రూ. 10 కోట్లకు పైగానే ఉండొచ్చని చెబుతున్నారు. సర్వీసులో చేరిన 14 ఏళ్లలోనే ఆయన భారీగా సంపాదించారన్న ఆరోపణలతో సోదాలు నిర్వహించి అదుపులో తీసుకున్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగం చేసే ఓ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. అతని ఆస్తులు చూసి అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. సర్వీసులో చేరి 14 సంవత్సరాలే కానీ జీవితానికి సరిపడా సంపాదించుకున్నాడు. రూ. 2 కోట్ల విలువైన ట్రిపుల్ ఎక్స్ విల్లా.. రెండు ఖరీదైన భవనాలు.. లక్షల విలువైన స్థలాలు ఇవన్నీ నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గోపాలరావు ఆస్తులు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గోపాలరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అనుమానంతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు. కర్నూలు సమీపంలోని పెద్దపాడు మైత్రి హోమ్స్ కాలనీలోని గోపాలరావు ఇల్లు, అనంతపురం, హైదరాబాద్‌ల్లోని బంధువులు, సన్నిహితుల ఇళ్లు, నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో గోపాల్‌రావుకు చెందిన మొత్తం రూ. 2.89 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించినట్లు కర్నూలు రేంజ్ ఏసీబీ ఇన్‌చార్జి డీఎస్పీ సీతారామారావు తెలిపారు. అతని ఆస్తులన్నీ కలిపితే ప్రస్తుత మార్కెట్‌లో రూ. 10 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. గోపాలరావును అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కోర్టులో హాజరపరచనున్నారు. కోర్టు అనుమతి వచ్చిన తర్వాత గోపాలరావుకు చెందిన బ్యాంక్ లాకర్‌ను కూడా త్వరలోనే తెరవనున్నారు.
గోపాలరావుకు ఈ ఉద్యోగం కారుణ్య నియామకం ద్వారా వచ్చింది. గోపాల్ తండ్రి ఈశ్వరరావు ఏపీఎస్పీలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ మృతిచెందారు. దాంతో కారుణ్య నియామకం కింద గోపాలరావుకు 2012లో జిల్లా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. ఆరు సంవత్సరాల తర్వాత 2018లో సీనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందారు. సీనియర్ అసిస్టెంట్‌గా ఉంటూనే పలు చోట్ల సబ్ రిజిస్ట్రార్‌గా కూడా ఆయన పనిచేశారు. అయితే, ఆయన విలాసవంతమైన జీవితం.. ఇల్లులే ఆయన్ను అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించింది అని చాలా మంది చెబుతున్నారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత మిగతా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.

