బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవోను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. జీవో ద్వారా రిజర్వేషన్లు సాధ్యం కావని తెలిసినా కోర్టులను ఆశ్రయించారని ఆరోపించారు. రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందని తాము మొదటి నుంచీ చెబుతున్నామని పేర్కొన్నారు.

విజయనగరంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ.. బీసీలకు రిజర్వేషన్ల అంశంలో చంద్రబాబు ప్రభుత్వానికి నిరాశ ఎదురైందని వ్యాఖ్యానించారు. హైకోర్టు తప్పుపట్టిన తర్వాత కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని విమర్శించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ వెనక్కి తగ్గిందని ఆరోపించారు. బీసీలకు ఎవరు ఏం చేశారనే అంశంపై చర్చించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.

బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని బొత్స డిమాండ్ చేశారు. బలహీన వర్గాలకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అబద్ధాలు, మోసాలకు తావులేకుండా పాలన సాగించాలని ప్రభుత్వానికి సూచించారు.

ఎన్నికలను అడ్డుకోవడానికి వైఎస్సార్‌సీపీ కోర్టులో కేసు వేసిందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఉద్యోగ సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని బొత్స సత్యనారాయణ సూచించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *