
దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం–పార్వతీపురం మధ్య ప్రత్యేక మెము రైలును రైల్వేశాఖ ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచి 20వ తేదీ వరకు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.
తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ సందడి మొదలైంది. సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో ఆర్టీసీ, రైల్వేశాఖ ప్రత్యేక బస్సులు, రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. విశాఖపట్నం నుంచి పార్వతీపురానికి ప్రత్యేక మెము రైలును ప్రకటించింది.
రైలు వేళలు ఇవే..
విశాఖపట్నం–పార్వతీపురం ప్రత్యేక రైలు (07268) ఉదయం 10 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో పార్వతీపురం–విశాఖపట్నం రైలు (07267) మధ్యాహ్నం 12.26 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు అక్టోబర్ 10 నుంచి 20వ తేదీ వరకు నడవనుంది.
ఈ స్టేషన్లలో ఆగుతుంది
ఈ రైలు విశాఖపట్నం, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరం, నర్సీపురం స్టేషన్లలో ఆగుతుంది.
దసరా సమయంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ రైలు ఉపయోగపడనుంది. ఉదయం విశాఖపట్నం నుంచి బయలుదేరే సౌకర్యంతో వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులు పార్వతీపురం చేరుకోవడానికి వీలుంటుంది.
ఇదిలా ఉండగా, ఉత్తరాంధ్ర మీదుగా ఇతర ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్‌కు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు తమ ప్రయాణానికి అనుగుణంగా రైళ్ల వివరాలను ముందుగానే తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
