ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లోని భూముల వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 325లో 45 ఎకరాల భూమి మాయం కావడానికి గల కారణాలను పూర్తిగా తేల్చాలని అధికారులను ఆదేశించారు.

రెండు గ్రామాల్లో భూముల సరిహద్దులను పరిశీలించేందుకు సర్వే నోటిఫికేషన్‌ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రెవెన్యూ రికార్డులను సమర్పించాలని కోరుతూ కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

అదే సమయంలో, ఆయా భూముల్లో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేక కాలనీ నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్‌ బోర్డుకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు.

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల పరిధిలోని భూముల వ్యవహారం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 325 భూములపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్‌ 325లో మొత్తం 388 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా.. క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో 343 ఎకరాలు మాత్రమే గుర్తించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. దీంతో రికార్డుల్లో ఉన్న భూమికి, క్షేత్రస్థాయిలో గుర్తించిన విస్తీర్ణానికి మధ్య 45 ఎకరాల తేడా ఎలా వచ్చిందనే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆరా తీశారు.

మిగిలిన 45 ఎకరాల భూమి ఎక్కడ ఉందో, రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎందుకు వ్యత్యాసం ఏర్పడిందో సమగ్రంగా తేల్చాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. భూముల సరిహద్దులు, రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించాలని సూచించారు.

ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో భూములపై కొనసాగుతున్న సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూముల వాస్తవ పరిస్థితిని నిర్ధారించడంతో పాటు రికార్డుల్లోని వివరాలను క్షేత్రస్థాయి సర్వేతో సరిపోల్చి పూర్తి నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

5 ఎకరాల భూమి తేడాకు అసలు కారణమేంటి? భూముల సరిహద్దుల గుర్తింపులో ఏమైనా సమస్యలు ఉన్నాయా? రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లు చోటుచేసుకున్నాయా? వంటి అంశాలపై సమగ్రంగా విచారణ జరిపి పూర్తి వివరాలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

ఎర్రవల్లి, సమీపంలోని వెంకటాపురం గ్రామాల్లో భూముల సర్వేను పూర్తి చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. భూముల సరిహద్దులకు ఆనుకుని ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన భూములపై ఉన్న రెవెన్యూ రికార్డులను సమర్పించాలని అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా సర్వే నంబర్ 325లోని భూములపై సమగ్ర స్థాయి పరిశీలన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ రికార్డుల్లో నమోదైన వివరాలను క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోల్చిన అనంతరం మాత్రమే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, సర్వే నంబర్ 325లోని భూములకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ఆదేశం ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా ‘తెలంగాణ అమరవీరుల కాలనీ’ నిర్మించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.

ఈ కాలనీలో అర్హులైన అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాలనీ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ బోర్డుకు అప్పగించాలని కూడా సూచించినట్లు సమాచారం.