ఉరవకొండ: నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ సాగునీటి ప్రాజెక్టుల పనులను త్వరితగతిన చేపడతామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. శనివారం పెద్ద కౌకుంట్లలో నిర్వహించిన ఉరవకొండ నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ఉరవకొండ నియోజకవర్గానికి ప్రయోజనం కలిగిందని మంత్రి పేర్కొన్నారు. బెలుగుప్ప మండలం సమీపంలోని కనేకల్‌ ప్రాంతాలను కలుపుకొని సుమారు 55 వేల ఎకరాలకు సాగునీరు అందించే 36వ ప్యాకేజీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే నవంబర్‌ లేదా డిసెంబర్‌లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

గడేహోతూరు, చిన్నహోతూరు, పొట్టిపాడు, చాబాల, ధర్మపురి గ్రామాలకు సంబంధించిన 33వ ప్యాకేజీ పనులకు మంజూరు తీసుకొచ్చి త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. రేణుమాకులపల్లి, నింబగల్లు, వ్యాసాపురం ప్రాంతాలకు సంబంధించిన 34వ ప్యాకేజీ పనులను డిసెంబర్‌ లేదా జనవరిలో పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

షేక్షానపల్లి–లత్తవరం చెరువు కాలువలో నిలిచిపోయిన, పూడిక పేరుకుపోయిన పనులను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. కొట్టాలపల్లి ఎత్తిపోతల పథకానికి టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రాకెట్ల–ఆమిద్యాల ఎత్తిపోతల పథకానికి బదులుగా రాకెట్ల సుంకాలమ్మ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి సుమారు 8 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

పార్టీ శ్రేణులకు సమన్వయంతో ముందుకు సాగాలని సూచన

రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన వెంటనే తదుపరి చర్యలపై సంప్రదింపులు ప్రారంభించాలని పార్టీ నాయకులకు పయ్యావుల కేశవ్ సూచించారు. రిజర్వేషన్ల ఫలితం ఎలా ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో అందరూ ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలని అన్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై మండల నాయకులు పరస్పరం చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. చిన్నచిన్న మనస్పర్థలను పక్కనపెట్టి సమన్వయంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రజల సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, పార్టీ కుటుంబ సభ్యుల సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల్లో పార్టీపై నమ్మకం మరింత పెరిగినప్పుడే నాయకులు, కార్యకర్తలకు మేలు జరుగుతుందని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

By Ramya