
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సింగీతం శ్రీనివాసరావు మృతిపై స్పందించిన ఆయన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమకు సింగీతం శ్రీనివాసరావు ఎన్నో విభిన్న చిత్రాలను అందించారని పవన్ కల్యాణ్ కొనియాడారు. ‘పుష్పక విమానం’, ‘విచిత్ర సోదరులు’, ‘మయూరి’, ‘ఆదిత్య 369’, ‘మైకేల్ మదన కామరాజు’ వంటి చిత్రాల్లో ఆయన చేసిన ప్రయోగాలు, చూపిన సృజనాత్మకత ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.
‘అమెరికా అమ్మాయి’, ‘పంతులమ్మ’ వంటి చిత్రాల్లోని గీతాలు కూడా ఎంతో ప్రజాదరణ పొందాయని పవన్ గుర్తుచేశారు. 94 ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా సినిమాపై ఆయనకున్న అపారమైన ఆసక్తిని చాటుకున్నారని అన్నారు. సింగీతం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ జాతీయవాద నాయకుడు శ్యామ్జీ కృష్ణ వర్మ జయంతి సందర్భంగా కూడా పవన్ కల్యాణ్ ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా ద్వారా ఆయన సందేశాన్ని పంచుకున్నారు.
జాతి స్ఫూర్తిని సజీవంగా ఉంచే వారే స్వేచ్ఛను ముందుకు తీసుకెళ్తారని పవన్ పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్యం పట్ల అంకితభావంతో దేశంలోనూ, విదేశాల్లోనూ జాతీయవాదులను ప్రేరేపించిన ధైర్యవంతుడైన దేశభక్తుడు శ్యామ్జీ కృష్ణ వర్మ అని కొనియాడారు.
ఇండియా హౌస్, ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ ద్వారా స్వయం పరిపాలన ఉద్యమాన్ని భారత సరిహద్దులు దాటి విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పవన్ కల్యాణ్ తెలిపారు. స్వేచ్ఛ కోసం నిలబడేలా ఒక తరాన్ని ప్రేరేపించిన మహనీయుడిగా శ్యామ్జీ కృష్ణ వర్మను స్మరించుకోవాలని అన్నారు.
