విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడలో ‘విజయవాడ ఉత్సవాలు’ పేరుతో భారీగా వేడుకలు నిర్వహించనున్నట్లు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు.

సింగ్‌నగర్‌లోని మకినేని బసవపున్నయ్య స్టేడియం, పున్నమి ఘాట్‌ తదితర ప్రాంతాల్లో ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. భక్తులు, సందర్శకులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, వివిధ ఆటలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఆదివారం సింగ్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బొండా ఉమా మాట్లాడారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ‘విజయవాడ ఉత్సవాలు’ ప్రచార బ్యానర్లను ఆవిష్కరించారు.

25 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం

దసరా సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 25 లక్షల మంది భక్తులు విజయవాడకు వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. భక్తులు, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

విజయవాడలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు, భక్తులు, ఆధ్యాత్మిక అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని బొండా ఉమా కోరారు.

By Ramya