దేశంలో ప్రస్తుతం ఎస్ఐఆర్‌ (SIR) పేరుతో ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మంది పేర్లను తొలగిస్తున్నారనే ఆరోపణలు, అభ్యంతరాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు రాజ్యాంగ స్ఫూర్తిపైనే దాడి వంటిదని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ఇదిలా ఉంటే, ఎస్ఐఆర్‌ వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘంపై, ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఆయన తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి. దీంతో ఎస్ఐఆర్‌ ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ దుమారం మరింత ముదురుతోంది.

భారీ సంఖ్యలో దేశ పౌరులను ఓటు హక్కుకు దూరం చేసే ఏ ప్రక్రియ అయినా రాజ్యాంగ వ్యవస్థను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ స్పష్టం చేశారు. ఏ అధికార వ్యవస్థకూ ఇలాంటి చర్యలకు పాల్పడే హక్కు లేదని, అలాంటి చర్యలను ఏ న్యాయస్థానం కూడా సమర్థించదని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన జస్టిస్ భూయాన్.. భారత రాజ్యాంగం పౌరులందరినీ సమానంగా చూస్తుందని అన్నారు. ఓటు హక్కు ఉన్నవారు, లేనివారు అంటూ రాజ్యాంగం పౌరులను రెండు వర్గాలుగా విభజించలేదని స్పష్టం చేశారు.

కోట్లాది మంది భారతీయులు తమ ఓటు హక్కును కోల్పోయి సొంత దేశంలోనే ద్వితీయ శ్రేణి పౌరులుగా మారే పరిస్థితి ఏర్పడితే.. అలాంటి ప్రక్రియను ఏ విధంగానూ సమర్థించలేమని జస్టిస్ భూయాన్ వ్యాఖ్యానించారు. ఇది నేరుగా రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీస్తుందని అన్నారు.

ఇలాంటి చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కల్పించే సమానత్వ హక్కును, ఆర్టికల్ 326 ద్వారా హామీ ఇచ్చిన సార్వజనీన వయోజన ఓటు హక్కును ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక రక్షణలను తిరస్కరించే ఏ చర్యనైనా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని జస్టిస్ భూయాన్ స్పష్టం చేశారు.

అయితే, ఆయన తన వ్యాఖ్యల్లో ఏదైనా నిర్దిష్ట ప్రక్రియను లేదా అధికార వ్యవస్థ పేరును ప్రస్తావించలేదు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానిదేనని సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా సమర్థించిన నాలుగు నెలల తర్వాత జస్టిస్ భుయాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత కొన్ని వారాలుగా ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి, దాని ఉద్దేశాలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు కొనసాగుతున్నాయి.

నల్సార్ లా యూనివర్సిటీలో జరిగిన 19వ నల్సార్–జస్టిస్ బి.ఆర్. సాహ్నే మెమోరియల్ మూట్ కోర్ట్ పోటీల ముగింపు కార్యక్రమంలో జస్టిస్ భుయాన్ ప్రసంగించారు. ఆయన గతంలో నల్సార్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా కూడా వ్యవహరించారు.

‘‘ఒక భారతీయ పౌరుడికి ఓటు హక్కును లేదా ఓటర్ల జాబితాలో పేరు పొందే హక్కును నిరాకరించలేం. అలా చేయడం అంటే శరీరం నుంచి ఆత్మను వేరు చేసినట్లే’’ అని జస్టిస్ భుయాన్ వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది మేలో SIRపై తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు, ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ ఎన్నికల సంఘం పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే, కమిషన్ తీసుకున్న చర్యలు అతిగా లేదా అనుచితంగా లేవని పేర్కొంది. ఓటర్ల అర్హతపై ఎన్నికల సంఘానికి సందేహాలు లేదా తగినంత సంతృప్తి లేకపోతే, సంబంధిత కేసులను తగిన అధికార యంత్రాంగానికి పంపవచ్చని కోర్టు తెలిపింది.

ఇలాంటి కేసుల విచారణ కోసం పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అప్పిలేట్ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేశారు. అక్కడ విచారణ పూర్తయిన కేసుల్లో ఇప్పటివరకు 93 శాతం మందికి తిరిగి ఓటు హక్కు లభించినట్లు సమాచారం.