
తమిళనాడులో అక్టోబర్ 6న రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వేడి పెరిగింది. ఎన్నికల ప్రచారంలో అధికార టీవీకే, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
తాజాగా సీఎం విజయ్ నిర్వహిస్తున్న ప్రచారాన్ని మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ‘సినిమా షూటింగ్’తో పోల్చారు. తన నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ఓటర్లను కలవని సీఎం విజయ్.. ఇప్పుడు ఉపఎన్నికల ప్రచారంలో మాత్రం విస్తృతంగా పర్యటిస్తున్నారని స్టాలిన్ విమర్శించారు. అంతేకాకుండా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ కనీసం 10 నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయలేదంటూ ఎద్దేవా చేశారు.
డీఎంకే విమర్శలకు విజయ్ కౌంటర్
ఎన్నికల ప్రచార సభలపై ప్రతిపక్ష డీఎంకే చేసిన విమర్శలకు తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత జోసెఫ్ విజయ్ కౌంటర్ ఇచ్చారు. మధురాంతకం, ధరాపురం ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయ్.. ఓటర్లతో మమేకం కావడం, స్థానిక హోటళ్లలో టీ తాగడం, ట్రాక్టర్ నడపడం వంటి అంశాలపై డీఎంకే నేతలు చేసిన విమర్శలకు స్పందించారు.
‘‘నేను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను కలిసే వ్యక్తిని కాదు. నాకు అనిపించినప్పుడు, ఎన్నిసార్లైనా నా ప్రజలను కలుస్తాను. దాంతో మీకేంటి కంగారు?’’ అంటూ విజయ్ ప్రశ్నించారు.
విజయ్ ప్రచారంపై స్టాలిన్ విమర్శలు
మరోవైపు, విజయ్ ప్రచార తీరును డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరిమితంగా ప్రచారం చేసిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రమే ఇంత విస్తృతంగా ప్రచారం చేయడంపై ఆయన ప్రశ్నలు సంధించారు.
మధురాంతకంలో విజయ్ నిర్వహించిన ప్రచారాన్ని ఉద్దేశిస్తూ స్టాలిన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘ముఖ్యమంత్రి ఇక్కడ మధురాంతకంలో ఒక షూటింగ్ చేశారు. అందులో టీ తాగే సీన్ ఒకటుంది. టీ తాగిన తర్వాత అక్కడ రూ.500 ఇచ్చి హడావుడి చేశారు. ప్రజలు రోజువారీ టీకి ఎంత ఖర్చు చేస్తారో ఆయనకు ఏమైనా తెలుసా?’’ అంటూ స్టాలిన్ విమర్శించారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో విజయ్, డీఎంకే నేతల మధ్య ఎన్నికల ప్రచార వేదికగా రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి.
ఎన్నికల తర్వాత తన సొంత నియోజకవర్గమైన పెరంబూరుకు విజయ్ ఒక్కసారి మాత్రమే వెళ్లారని స్టాలిన్ విమర్శించారు. అయితే, ప్రస్తుతం మధురాంతకంలో జరుగుతున్న ఉపఎన్నికల నేపథ్యంలో ఆయన ఇప్పటికే రెండుసార్లు పర్యటించడంతో పాటు ప్రతి వీధిలోనూ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారని ఎత్తిచూపారు.
“ఇప్పుడు విజయ్ ఎందుకింతగా ఆందోళన చెందుతున్నారు? తన సొంత పరిపాలనపై ఆయనకే నమ్మకం లేకపోవడమే ఇందుకు కారణం” అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
2026 సాధారణ ఎన్నికల సమయంలో విజయ్ కేవలం పది ప్రాంతాల్లో మాత్రమే ప్రచారం చేశారని, అది కూడా వాహనం దిగకుండానే నిర్వహించారని స్టాలిన్ అన్నారు. “ఇప్పుడు మాత్రం మధురాంతకంలోని ప్రతి వీధిలో తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి గారూ, మీలో కనిపిస్తున్న ఈ భయం నాకు నచ్చింది. ప్రపంచాన్ని మార్చడానికి ఐదు నిమిషాలు చాలని అంటుంటారు. కానీ ఒక్క నియోజకవర్గంలో ఓట్లు సాధించేందుకు మాత్రం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ధరాపురంలో కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు” అని విమర్శించారు.
మరోవైపు ఉదయనిధి స్టాలిన్ కూడా విజయ్ ప్రచార తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ధరాపురం, మధురాంతకం ప్రజలకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఏప్రిల్లో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం కోసం పెద్దగా బయటకు రాలేదు. మొత్తం ఏడు, ఎనిమిది రోజులు మాత్రమే ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు మధురాంతకంలోని ప్రతి రోడ్డులో తిరుగుతూ, టీ కొట్లకు వెళ్తూ ఏకంగా ఎనిమిది గంటల పాటు ప్రచారం చేస్తున్నారు” అని అన్నారు.
“ముఖ్యమంత్రి గారు మొదటిసారి టీ కొట్టు చూడటం, టీ తాగడం, ట్రాక్టర్ నడపడం వంటివి చేస్తున్నట్లుగా ఉంది” అంటూ ఉదయనిధి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
