
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి భక్తుడు భారీ కానుక సమర్పించారు. ఏకంగా 121 కిలోల బరువున్న 45 రకాల స్వర్ణాభరణాలను విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ సంస్థ ఛైర్మన్ వర్థమాన్ జైన్ ఈ అపురూప కానుకను టీటీడీకి అందించారు.
సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ స్వర్ణాభరణాలను టీటీడీ అధికారులకు అప్పగించారు. వీటి విలువ సుమారు రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. శ్రీవారి శిరస్సు నుంచి పాదాల వరకు అలంకరించేలా ఈ ఆభరణాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇందులో కిరీటం, శంఖు, చక్రాలు, కటి వరహస్తాలు, వడ్డాణం, పాదుకలు తదితర 45 రకాల ఆభరణాలు ఉన్నాయి.
ప్రముఖ జ్యువెలరీ సంస్థ ద్వారా వీటిని అత్యంత ప్రత్యేకంగా రూపొందించారు. భక్తుడు సమర్పించిన ఈ స్వర్ణాభరణాలను తిరుమలలోని రంగనాయక మండపంలో భక్తుల సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచారు. గతంలోనూ వర్థమాన్ జైన్ టీటీడీకి పలుమార్లు విరాళాలు అందించారు.
ఈ ఏడాది మే 16న ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును సైతం శ్రీవారి సేవకు విరాళంగా సమర్పించారు. శ్రీవారిపై తనకున్న భక్తిని చాటుకుంటూ భారీ స్థాయిలో స్వర్ణాభరణాలను కానుకగా అందించిన వర్థమాన్ జైన్‌ను పలువురు అభినందిస్తున్నారు.




