
రంపచోడవరం, బ్యూరో: పోలవరం జిల్లాలో జరుగుతున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను జిల్లా ఎస్పీ కే. చక్రవర్తి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును తనిఖీ చేసి, విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు వేసేలా భద్రత కల్పించాలని సూచించారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. పోలింగ్ ముగిసే వరకు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.




