
విజయనగరం జిల్లాలో కొద్దిరోజులగా అడవి ఏనుగులు సంచరిస్తున్నాయి. గజరాజుల దెబ్బకు జనాలు భయపడుతున్నారు.. పంటల్ని నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి ఈ అడవి ఏనుగుల్ని కుంకీల సాయంతో తరిమేసి, ఆ తర్వాత మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెల్లని దుస్తులు ధరించి అడవి ఏనుగుల దగ్గరకు వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఏపీలోని చిత్తూరు, తిరుపతి, ఉత్తరాంధ్రలోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రజల్ని ఏనుగుల భయం వెంటాడుతోంది. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామ చెరువులో అడవి ఏనుగుల గుంపు సంచరిస్తోంది. వెంటనే అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.. ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని అలర్ట్ చేశారు. ఏనుగుల్ని రెచ్చగొట్టేలా చేయొద్దని.. అలాగే తెల్లని దుస్తులు ధరిస్తే గజరాజులకు కనిపించకుండా ఉండాలని సూచించారు. ఏనుగుల్ని గ్రామాల నుంచి తరిమేసేందుకు కుంకి ఏనుగుల్ని కూడా రంగంలోకి దించామని అటవీశాఖ అధికారులు తెలిపారు. కుంకీ ఏనుగుల్ని అడవి ఏనుగులు భయంతో వెళ్లిపోతున్నాయన్నారు.
తెల్లని దుస్తులు ధరిస్తే ఏనుగులు రెచ్చిపోతాయని చెబుతుంటారు. ఏనుగులు ఎక్కువగా అటవీ ప్రాంతంలో సంచరిస్తాయి.. అడవిలో చెట్లు, పొదలు పచ్చగా, మట్టి రంగులోఉంటాయి. అప్పుడు తెల్లిని రంగు చాలా కాంతివంతంగా కనిపిస్తుంది. అందుకే ఏనుగులు, కొన్ని అడవి జంతువులు తెల్లగా, ప్రకాశంతంగా ఏదైనా వస్తువు కదిలితే ఆందోళన, భయంతో దాడులు చేసే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. అందుకే తెల్లని దుస్తులు వేసుకున్నవారు ఏనుగులకు కనిపించకూడదని చెబుతుంటారు. అందుకే ఎవరైనా వైల్డ్‌లైఫ్ సఫారీ, అడవుల్లోకి వెళ్ళేటప్పుడు తెల్లటి, ప్రకాశవంతంగా కనిపించే రంగుల దుస్తులు వేసుకోవద్దని సూచిస్తుంటారు. ఎర్ర రంగు కూడా వేసుకోవద్దని చెబుతుంటారు.
మరోవైపు బొబ్బిలి ప్రాంతంలోని అడవి ఏనుగుల్ని మచ్చిక చేసుకునేందుకు కుంకీ ఏనుగులతో ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఏనుగుల కదలికల్ని అటవీశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.. గ్రామాల వైపు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏనుగులు సంచరిస్తున్న చుట్టుపక్కల గ్రామాలను అలర్ట్ చేశారు. ఏనుగులు వస్తే ఫోటోలు, వీడియోలు తీయొద్దని.. వాటికి దగ్గర వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఏనుగుల గుంపు వస్తే వాటిని తరిమేయకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచనలు చేశారు. కుంకీల సాయంతో అడవి ఏనుగుల్ని అక్కడి నుంచి తరిమేస్తామంటున్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లా అడవి ఏనుగులు పంటల్ని నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇటీవల అటవీ అధికారులు చిత్తూరు నుంచి జయంత్, అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగుల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆపరేషన్ గజ పేరుతో కుంకీ గజరాజుల సాయంతో ఈ అడవి ఏనుగుల్ని మచ్చిక చేసుకుంటున్నారు. కుంకీలను చూసి అడవి ఏనుగులు దూరంగా వెళ్లిపోతున్నాయి. డ్రోన్ల ద్వారా ఏనుగుల గుంపు కదలికల్ని గుర్తిస్తున్నారు. అటవీ అధికారులంతా రెండు రోజులుగా ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. మొత్తం మీద విజయనగరం జిల్లాలో కుంకీలక సాయంతో అడవి ఏనుగుల బెడద నుంచి ప్రజలకు ఊరట కల్పిస్తున్నారు.

