
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 25 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో రోజుకు 2.5 లక్షల మంది రాకకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టారు. మూడు హోల్డింగ్ ఏరియాల్లో 30 వేల మంది భక్తులు వేచి ఉండేలా సదుపాయాలు కల్పిస్తున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
దసరా ఏర్పాట్లపై విజయవాడలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోనున్నారని, 15న సరస్ మేళాను ప్రారంభిస్తారని తెలిపారు. దసరా ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవం, సరస్ మేళా నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్, పారిశుధ్యం, తాగునీరు వంటి అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
సామాన్య భక్తులే కేంద్రంగా..
సామాన్య భక్తులే కేంద్రంగా ఏర్పాట్లు ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. హోల్డింగ్ ఏరియాల్లో ప్రసాదం, ఆహారం, మజ్జిగ, తాగునీరు అందుబాటులో ఉంచాలని, రద్దీ పెరిగినా ఇబ్బంది లేకుండా అదనపు నిల్వలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ముందస్తు చర్యలతో సమస్యలకు చెక్
లక్షలాది మంది భక్తులు వచ్చే నేపథ్యంలో పోలీసు, దేవాదాయ, రెవెన్యూ, మున్సిపల్, వైద్య ఆరోగ్య, ఆర్టీసీ, విద్యుత్, అగ్నిమాపక తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. గత ఉత్సవాల్లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మూల నక్షత్రం రోజున సీఎం పట్టు వస్త్రాల సమర్పణ
మూల నక్షత్రం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని మంత్రి తెలిపారు. సీఎం పర్యటనతో పాటు సామాన్య భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉత్సవాల అనంతరం భవానీల కోసం మరో మూడు, నాలుగు రోజుల పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
