
బిజినెస్ ప్రతినిధి: వ్యాపారాలకు జీఎస్టీ నిబంధనలను సరళతరం చేయడంతో పాటు పన్ను చెల్లింపు ప్రక్రియలో జాప్యాలను తగ్గించే దిశగా కేంద్రం మరో విడత సంస్కరణలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 8న న్యూఢిల్లీలో జరగనున్న 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రిజిస్ట్రేషన్, రిఫండ్లు, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ), పన్ను వివాదాలు, జీఎస్టీ నేరాలపై కీలక ప్రతిపాదనలు చర్చకు రానున్నట్లు సమాచారం.
17 రోజుల్లో రిఫండ్ పూర్తి?
వ్యాపారాలకు కీలకమైన రిఫండ్ ప్రక్రియను వేగవంతం చేసే ప్రతిపాదనలకు సమావేశంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రిఫండ్ దరఖాస్తును పది రోజుల్లోగా పరిశీలించి, రిస్క్ అంచనా అనంతరం క్లెయిమ్‌లోని 90 శాతం మొత్తాన్ని ముందుగానే విడుదల చేయాలని భావిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని దరఖాస్తు అంగీకరించిన ఏడు రోజుల్లో చెల్లించేలా నిబంధనలు మార్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం రిఫండ్ దరఖాస్తుల అంగీకారానికే 21 నుంచి 45 రోజుల సమయం పడుతోంది. కొత్త విధానం అమల్లోకి వస్తే మొత్తం ప్రక్రియ 17 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉండటంతో వ్యాపారాలకు వర్కింగ్ క్యాపిటల్ త్వరగా అందుబాటులోకి రానుంది. తక్కువ రిస్క్ ఉన్న క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందుకు రిస్క్ ఆధారిత విధానాన్ని కూడా తీసుకురావాలని భావిస్తున్నారు.
మూడు రోజుల్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్
జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను మరింత సులభతరం చేయడంపైనా కౌన్సిల్ దృష్టి పెట్టనుంది. ప్రస్తుతం 61 శాతం మంది పన్ను చెల్లింపుదారులకు మూడు పని దినాల్లోనే అధికారి జోక్యం లేకుండా రిజిస్ట్రేషన్ మంజూరవుతోంది.
మిగిలిన దరఖాస్తుల్లో అనవసర ప్రశ్నలు, తిరస్కరణలను తగ్గించేందుకు ఒకే దరఖాస్తుతో ప్రక్రియ పూర్తి చేయడం, అవసరమైన పత్రాలపై స్పష్టత, ఇప్పటికే ఉన్న GSTIN వివరాలను వినియోగించుకోవడం వంటి మార్పులను ప్రతిపాదించే అవకాశం ఉంది. పలు రాష్ట్రాల్లో ఒకేసారి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు, అధికార పరిధిని ఆటోమేటిక్‌గా కేటాయించే విధానంపైనా చర్చ జరగనున్నట్లు సమాచారం.
