
తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఘోర ప్రమాదం జరిగింది. మందుల తయారీ సంస్థ టిల్ హెల్త్‌కేర్‌లో వాటర్ బాయిలర్ ఒక్కసారిగా పేలడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. నైట్ షిఫ్ట్‌లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
బాయిలర్ పేలుడు ధాటికి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏపీకి చెందిన చిన్న మస్తాన్, తమిళనాడుకు చెందిన రమేష్, మోహన్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన గౌరబ్ రాయ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి శ్రీసిటీ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన తడకు చెందిన వాసు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో సుమారు 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. బాయిలర్ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
శ్రీసిటీలో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
