గుడివాడ మున్సిపాలిటీ ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఎన్నికల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికలకు మార్గం సుగమమైంది.

గుడివాడ సమీపంలోని గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు 2021లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో భాగంగా గుడివాడ రూరల్ మండలంలోని లింగవరం, వలివర్తిపాడు, మల్లయ్యపాలెం, బొమ్ములూరు, బిళ్లపాడు పంచాయతీలను విలీనం చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిలిచిపోయాయి.

తాజాగా గ్రామాల విలీనానికి సంబంధించిన సవరణ చట్టాన్ని సమర్థిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసే వార్డులు, డివిజన్ల పునర్విభజనలో కోర్టు జోక్యం చేసుకోదని స్పష్టం చేయడంతో ఈ అంశంపై ఉన్న సందిగ్ధత తొలగింది.

ఇక ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా రూపకల్పన, వార్డుల పునర్విభజన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర ప్రక్రియలను అధికారులు చేపట్టాల్సి ఉంది. గుడివాడ మున్సిపాలిటీకి రెండో విడతలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

By Ramya