దేశవ్యాప్తంగా ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో లోపాలు, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ.. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (CEC) జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ఆయన మాజీ మిత్రపక్షమైన డీఎంకే విమర్శలు గుప్పించింది. తమిళనాడులో SIRపై రాహుల్‌ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించింది. అయితే, డీఎంకే ఈ వ్యాఖ్యలు చేసిన 24 గంటలు కూడా గడవకముందే తన వైఖరిని మార్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

SIR, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (CEC) జ్ఞానేష్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై విమర్శలు చేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే.. 24 గంటల్లోనే తన వైఖరిని మార్చుకుంది. బుధవారం రాహుల్‌ గాంధీకి మద్దతుగా నిలవడం ద్వారా రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

రాహుల్‌ గాంధీ చేపట్టిన నిరసనపై డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్‌ అన్నాదురై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులో SIRపై రాహుల్‌ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.

అయితే, తాజాగా డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్‌ ఇలంగోవన్‌ రాహుల్‌ గాంధీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉన్నత పదవిలో ఉన్న జ్ఞానేష్‌ కుమార్‌ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పుడు ఎన్నికలు పారదర్శకంగా ఎలా జరుగుతాయి? ఆయనను తప్పకుండా సీఈసీ పదవి నుంచి తొలగించాలి. ప్రభుత్వ తప్పులపై పోరాడే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. రాహుల్‌ గాంధీ నిన్న చేసింది అదే. జ్ఞానేష్‌ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ నిరసన చేపట్టడం ప్రభుత్వానికి నచ్చడం లేదు’’ అని ఇలంగోవన్‌ వ్యాఖ్యానించారు.

ఒకవైపు రాహుల్‌ గాంధీపై విమర్శలు చేసిన కొద్దిసేపటికే మరోవైపు ఆయనకు మద్దతుగా డీఎంకే నేతలు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో SIR అంశంపై డీఎంకేలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

ఢిల్లీలో విపక్ష ఇండియా కూటమి ఎంపీల నిరసనలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న విపక్ష ఎంపీలు.. మంగళవారం పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం ‘నిర్వచన్ సదన్’ వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.

అయితే, ర్యాలీని ఢిల్లీ పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. దూరదర్శన్ భవన్ వద్ద భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి విపక్ష ఎంపీలను నిలువరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు విపక్ష ఎంపీలు బారికేడ్లపైకి ఎక్కి నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి వరకు హైడ్రామా కొనసాగిన అనంతరం ఇండియా కూటమి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో డీఎంకే నేత శరవణన్ అన్నాదురై ‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమిళనాడులో SIR ప్రక్రియ ద్వారా ఓట్ల తొలగింపు అంశంపై రాహుల్ గాంధీ వైఖరిని ఆయన ప్రశ్నించారు.

SIR విషయంలో రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని శరవణన్ అన్నాదురై ఆరోపించారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో తమిళనాడుకు సంబంధించిన అంశాలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తమిళనాడులో SIR ప్రక్రియ కారణంగా లక్షలాది ఓట్లు తొలగించారని డీఎంకే ఆరోపిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రాహుల్ గాంధీ.. తమిళనాడులో ఓట్ల తొలగింపు విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారని శరవణన్ అన్నాదురై నిలదీశారు.