
గత ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు జోసెఫ్ విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను తప్పుగా వెల్లడించారని ఆరోపిస్తూ ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఎన్నికల పిటిషన్ దాఖలైంది.
విజయ్ తన ఆస్తుల విలువను రూ.600 కోట్లుగా ప్రకటించారని, అయితే మరో రూ.30 కోట్ల విలువైన ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించకుండా దాచిపెట్టారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ వ్యవహారంపై మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది
రూ.30 కోట్ల ఆస్తులు వెల్లడించకపోవడం ‘అవినీతి’ కిందకు వస్తుందా? విజయ్ కేసులో హైకోర్టు ప్రశ్న
టీవీకే అధినేత, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో దాదాపు రూ.600 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించినప్పటికీ, మరో రూ.30 కోట్ల విలువైన ఆస్తులను వెల్లడించకపోవడాన్ని ‘అవినీతి ఉల్లంఘన’ (Corrupt Practice)గా పరిగణించవచ్చా? అని మద్రాస్ హైకోర్టు బుధవారం ప్రశ్నించింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్ గెలుపును సవాలు చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను కొట్టివేయాలని ఆయన కోరారు. దీనిపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రూ.30 కోట్ల ఆస్తులు మరిచిపోతే ‘అవినీతి’ అవుతుందా?
విజయ్ ప్రముఖ సినీ నటుడు కావడంతో ఆయనకు అనేక ఆస్తులు, ఆర్థిక ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచాల్సిన ఆస్తుల వివరాలను విజయ్ స్వయంగా సిద్ధం చేసి ఉండకపోవచ్చని, ఇందుకోసం తన చార్టర్డ్ అకౌంటెంట్ (CA)పై ఆధారపడి ఉండవచ్చని కోర్టు అభిప్రాయపడింది.
ఒకవేళ చార్టర్డ్ అకౌంటెంట్ పొరపాటున కొన్ని ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో చేర్చకుండా వదిలేస్తే, ఆ కారణంతోనే ఎన్నికను రద్దు చేయవచ్చా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కేవలం ఆస్తుల వివరాల్లో జరిగిన పొరపాటు లేదా మినహాయింపును నేరుగా ‘అవినీతి ఉల్లంఘన’గా పరిగణించాలా అనే అంశంపై కోర్టు సందేహం వ్యక్తం చేసింది.
‘సీఏపై ఆధారపడటం సహజమే.. ఆస్తులు మిస్ అయితే ఎన్నిక రద్దు చేయాలా?’: హైకోర్టు
‘‘నేను న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు నా ఆస్తుల వివరాలను ప్రకటించాల్సి వచ్చింది. ఆ వివరాలన్నింటినీ నేనే స్వయంగా కూర్చొని సిద్ధం చేశానని మీరు అనుకుంటున్నారా? నేను నా చార్టర్డ్ అకౌంటెంట్‌పై ఆధారపడ్డాను. అదే విధంగా విజయ్ కూడా స్వయంగా కూర్చొని తన ఆస్తుల జాబితాను తయారు చేసి ఉంటారని అనుకుంటున్నారా? ఆయన కూడా తన సీఏపైనే ఆధారపడి ఉంటారు’’ అని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
చార్టర్డ్ అకౌంటెంట్ పొరపాటున కొన్ని ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో చేర్చకుండా వదిలేస్తే, ఆ కారణంతో ఎన్నికను రద్దు చేయవచ్చా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘‘విజయ్ తనకు ఉన్న దాదాపు రూ.600 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు. అందులో రూ.30 కోట్ల విలువైన ఆస్తులు వెల్లడించకుండా మిగిలిపోతే, దాన్ని అవినీతి ఉల్లంఘనగా పరిగణించవచ్చా?’’ అని కోర్టు ప్రశ్నించింది.
అదేవిధంగా, అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించకపోవడం పెరంబూర్ నియోజకవర్గ ఓటర్ల తీర్పుపై ప్రభావం చూపిందా? అనే అంశాన్ని కూడా కోర్టు పరిశీలించింది. విజయ్‌కు ఓటు వేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్న ఓటరు, ఆయన రూ.30 కోట్ల విలువైన అదనపు ఆస్తుల వివరాలను వెల్లడించలేదన్న విషయం తెలిస్తే తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందా? అని పిటిషనర్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు.
‘‘నేను విజయ్‌కు ఓటు వేయాలని నిర్ణయించుకుంటే, ఆయనకు ఎలాంటి ఆస్తులు ఉన్నాయన్నది నాకు అనవసరం. మరి రూ.30 కోట్ల విలువైన ఆస్తుల వివరాలను వెల్లడించకపోవడం పెరంబూర్ ఓటరు నిర్ణయాన్ని నిజంగా ప్రభావితం చేస్తుందని మీరు భావిస్తున్నారా?’’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు
