• బీసీ నిరుద్యోగ యువతకు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరుగైన శిక్షణ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీతో పీ4 (P4) మోడల్‌లో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. రాష్ట్ర బీసీ స్టడీ సర్కిళ్ల చరిత్రలో ఈ ఒప్పందం ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఆమె పేర్కొన్నారు.
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పీ4 మోడల్‌లో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ కావాలనుకునే బీసీ నిరుద్యోగ యువతకు ఉచితంగా కోచింగ్ అందించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని వివరించారు.
  • ఎంఓయూలో భాగంగా డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించనుంది. వివిధ సబ్జెక్టుల్లో నైపుణ్యం కలిగిన అధ్యాపకులతో శిక్షణ ఇప్పించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సివిల్స్‌లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీసీ యువతకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
  • బీసీ యువత కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నత స్థాయి పదవుల్లోకి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని సవిత స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.

రెండు విడతల్లో 200 మందికి ఉచిత శిక్షణ

  • బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఇప్పటివరకు రెండు విడతల్లో మొత్తం 200 మంది అభ్యర్థులకు ఉచిత సివిల్ సర్వీసెస్ శిక్షణ అందించినట్లు మంత్రి వెల్లడించారు. 2024-25 విద్యా సంవత్సరంలో మొదటి బ్యాచ్‌లో 100 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
  • ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ స్టడీ సర్కిల్ ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 100 మంది అభ్యర్థులకు సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల కోసం ఉచిత కోచింగ్ అందించినట్లు వివరించారు.
  • అదేవిధంగా 2025-26 విద్యా సంవత్సరంలో రెండో బ్యాచ్‌లో మరో 100 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చినట్లు మంత్రి సవిత పేర్కొన్నారు. తాజా ఒప్పందంతో బీసీ యువతకు నాణ్యమైన శిక్షణ, అధ్యయన సామగ్రి అందుబాటులోకి వచ్చి సివిల్ సర్వీసెస్‌లో వారి ప్రాతినిధ్యం పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *