
విశాఖపట్నంవాసులకు ఉచితంగా హోమియో వైద్య సేవలు అందుతున్నాయి. గత 64 ఏళ్లుగా మాస్టర్ హోమియో వైద్యాలయంలో ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ప్రతిరోజూ ఇక్కడ 150మందికి వైద్య సేవలు అందుతున్నాయి. అంతేకాదు శనివారం, ఆదివారం దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి భోజనం కూడా ఉంటుంది. విశాఖపట్నం అక్కయ్యపాలెంలోని పోస్టాఫీసు వీధిలో ఈ మాస్టర్ హోమియో వైద్యాలయం ఉంది.
ప్రస్తుతం వైద్యం చాలా ఖరీదైపోయింది.. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రి ఖర్చులు, మందులు, పరీక్షల ధరలు భారంగా మారాయి. అలాంటిది ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం అందిస్తారంటే నమ్ముతారా?.. అవును నిజమే, విశాఖపట్నంలో ఓ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. అది కూడా ఒకటి రెండు కాదు 64 ఏళ్లుగా ఈ వైద్యం సేవలు కొనసాగుతున్నాయి. నగరంలోని అక్కయ్యపాలెం మాస్టర్ హోమియో వైద్యాలయంలో ఉచిత వైద్యం అందిస్తున్నారు. 1962లో ఎక్కిరాల కృష్ణమాచార్యులు ఈ వైద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కేఎస్ శాస్త్రి 2025 వరకు సేవలు అందించగా.. ప్రస్తుతం శాస్త్రి చిన్న కుమారుడు శ్రీనివాస్ ప్రజలకు సేవలు అందిస్తు్న్నారు.
విశాఖపట్నం అక్కయ్యపాలెం పోస్టాఫీసు వీధిలో మాస్టర్ హోమియో వైద్యాలయంలో ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం ఏడు గంటల నుంచి జనాలు వస్తారు.. అక్కడ టోకెన్ తీసుకుని వేచి ఉండాలి. ఒక్కొక్కరిని పిలిచి టోకెన్ తీసుకుని రోజుకు150మందికి వైద్య సేవలు అందిస్తారు. ఈ వైద్యాలయంలో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది కూడా ఉచితంగా సేవలు అందించడం విశేషం. ఈ వైద్యాలయంలో చికిత్స తీసుకుని ఉపశమనం పొందినవారు కూడా ఇక్కడ సేవలు అందిస్తుంటారు. శని, ఆదివారాల్లో మాత్రం దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు, వారి వెంట వచ్చేవారికి ఉచిత భోజన సదుపాయం ఉంది.
మాస్టర్ వైద్యాలయంలో రోగుల శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకుని వైద్యం అందిస్తారు.. మందులు తయారు చేస్తారు. ఈ మందులు ఉపయోగించిన తర్వాత రోగి శరీరంలో లక్షణాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత తగిన విధంగా వైద్యం అందిస్తే నివారణ సాధ్యమేనని డాక్టర్లు అంటున్నారు. వాస్తవానికి మాస్టర్ హోమియా వైద్యాలయం నిర్వహించడం, మందుల తయారీ ఎంతో ఖర్చుతో కూడుకుని ఉంది. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని ఉపశమనం పొందినవారు కొందరు విరాళాలు అందిస్తుంటారు.. వాటితో ఈ ఆస్పత్రి నడుస్తుంది. అంతేకాదు చినముషిడివాడలో ఎక్కిరాల కృష్ణమాచార్యులు కుమారుడు అనంతకృష్ణ శని, ఆదివారాల్లో హోమియో వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాదు కృష్ణమాచార్యుల శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు.

